న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అటు పునరుత్పాదక(రెనెవబుల్), ఇటు బొగ్గుఆధారిత(థర్మల్) విద్యుత్ సరఫరాకు భారీ కాంట్రాక్టును పొందింది. దీనిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి 6,600 మెగావాట్ల రెనెవబుల్, థర్మల్ విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ఇందుకు వేసిన బిడ్ గెలుపొందినట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ బాటలో యూనిట్‌కు కోట్ చేసిన రూ. 4.08 ధర ద్వారా జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టొరెంట్ పవర్‌లను అధిగమించింది.
వెరసి రెనెవబుల్, థర్మల్ మిక్స్ ద్వారా 25ఏళ్ల దీర్ఘకాలానికి విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఎలక్ట్రిసిటీ ధరతో పోలిస్తే అదానీ గ్రూప్ యూనిట్‌కు దాదాపు రూపాయి తక్కువగా కోట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఎల్‌వోఐ జారీ అయిన తేదీ నుంచి రెండు రోజుల్లోగా సరఫరాలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. కాగా.. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ పంపిణీ సంస్థ(ఎంఎస్‌ఈడీసీఎల్) 6,600 మెగావాట్ల విద్యుత్ కోసం ఎల్‌వోఐను జారీ చేసినట్లు అదానీ పవర్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా అదానీ పవర్ కొత్తగా ఏర్పాటు చేసిన 1,600 మెగావాట్ల అల్ట్రాసూపర్‌క్రిటికల్ సామర్థ్యం నుంచి 1,496 మెగావాట్ల థర్మల్ పవర్‌ను సరఫరా చేయనుంది. సహచర సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్, కచ్‌లోని ఖావ్డా రెనెవబుల్ ఎనర్జీ పార్క్ నుంచి 5 గిగావాట్ల(5,000 మెగావాట్లు) సోలార్ పవర్‌ను సరఫరా చేయనుంది. బిడ్ ప్రకారం అదానీ గ్రీన్ యూనిట్‌కు రూ. 2.70 ఫిక్స్‌డ్ ధరలో సోలార్ పవర్‌ను కాంట్రాక్ట్ కాలంలో సరఫరా చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment