
న్యూఢిల్లీ: సరఫరా వ్యవస్థలో చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనగలిగే నమ్మకమైన పోటీదారుగా భారత్ ఎదగడం ప్రపంచానికి ఎంతో అవసరమని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. 2024లో ఇందుకు చక్కని అవకాశాలు ఉన్నాయని, దేశంలోకి పెట్టుబడులు అసాధారణ స్థాయిలో వెల్లువెత్తగలవని నూతన సంవత్సర సందేశంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థ ఉవ్వెత్తున ఎగుస్తుందనే సంకేతాలే అన్ని వైపుల నుంచి లభిస్తున్నాయని మహీంద్రా పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పురోగమించాలంటే విప్లవాత్మకమైన ఆవిష్కరణలు చేయగలిగే సత్తాను సాధించడం కీలకంగా ఉండగలదని ఆయన చెప్పారు.