రూ.5 లక్షల కోట్ల వ్యయంతో 3 స్మార్ట్ సిటీల అభివృద్ధి
ఫ్రీ ఎకనామిక్ జోన్‌గా దక్షిణ కొరియాలోని ఇంచియాన్
ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ నేపథ్యంలో పరిశీలన.. అభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి) ఈశాన్య ఆసియాలో దక్షిణ కొరియాను ఆర్థిక హబ్‌గా నిలపాలన్న లక్ష్యంతో 2003లో ది ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ (ఐఎఫ్‌ఈజెడ్)ను ఏర్పాటు చేశారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడమే దాని ప్రధాన ఉద్దేశం. ఇక్కడే రూ.5 లక్షల కోట్ల వ్యయంతో మూడు అంతర్జాతీయ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేశారు. మూసీ పునరుజ్జీవం, ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ బృహత్తర ప్రాజెక్టులపై అధ్యయనానికి రాష్ట్ర మంత్రుల బృందం దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
మూడో రోజైన బుధవారం ఇంచియాన్ నగరంలో అభివృద్ధి చేసిన 3 అంతర్జా తీయ స్మార్ట్ సిటీలను మంత్రులు, అధికారుల బృందం పరిశీలించింది. పనిలోపనిగా స్టోర్స్ యూనివర్సిటీని కూడా సందర్శించింది. సాంగ్డో నగరంలో ఐటీ, బయోటెక్నాలజీ (బీటీ), సేవల పరిశ్రమలు, చెయోంగ్నాలో ఫైనాన్స్, హైటెక్ ఇండస్ట్రీలు, యోంగ్‌జోంగ్‌లో లాజిస్టిక్, టూరిజం పరిశ్రమలను అభి వృద్ధి చేశారు. ప్రస్తుతం 122.34 చదరపు కిలో మీటర్లు (చ.కి.మీ.) విస్తీర్ణంలో ఉన్న ఈ మూడు నగరాల్లో 5,43,653 జనాభా నివాసం ఉంటోంది.
3 గంటల్లో ఇతర నగరాలకు..
ఇంచియాన్ నుంచి షాంఘై, బీజింగ్, హాంగ్‌కాంగ్ వంటి నగరాలకు మూడు గంటల్లో చేరుకోవచ్చు. దీంతో ఎగుమతి, దిగుమతి కేంద్రాలకు ఇంచియాన్ నిలయంగా మారింది. పబ్లిక్, మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌లతో పాటు ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవు, ఫెర్రీ టెర్మినల్స్‌తో మెరుగైన రవాణావ్యవస్థ ఉంది.
ఇంచియాన్‌లోని అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఉండటంతో పరిశ్రమ అవసరాలకు తగ్గిన నిపుణులు, నైపుణ్యమున్న ఉద్యోగులకు కొరతే లేదు. అన్ని రకాల మౌలిక సదుపాయాలున్న స్థలాలు, దీర్ఘకాలంపాటు లీజు, నిర్మాణ వ్యయంలో రాయితీలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) భద్రత, విదేశీ సంస్థలకు ప్రత్యేక పన్ను మినహాయింపులు వంటివి అందిస్తున్నారు.
స్టార్టప్ పార్క్..
ఇప్పటివరకు ఐఎఫ్‌ఈజెడ్‌లో 14.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు వచ్చాయి. ఇందులో 206 గ్లోబల్, 3,481 స్థానిక సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సెమీ కండక్టర్లు, రోబో, డ్రోన్ వంటి పరిశ్రమలకు చెందిన సంస్థలతో పాటు గ్రీన్ క్లైమెట్ ఫండ్ (జీసీఎఫ్) వంటి ఐక్యరాజ్య సమితికి చెందిన 15 కార్యాలయాలు న్నాయి.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతను ఆకర్షించేందుకు ఇంచియాన్ నగరంలో స్టార్టప్ పార్క్‌ను కూడా నెలకొల్పారు. ప్రస్తుతం ఇందులో 422 స్టార్టప్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సుమారు 208 బిలియన్ వాన్ నిధులను సమీకరించాయి. ఇంచియాన్ గ్లోబల్ క్యాంపస్‌తో పాటు 6 కొరియన్ వర్సిటీలు, విదేశీ విశ్వ విద్యాలయాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment