సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీల ఫ్యాక్టరీలో సోమవారం(జూన్24) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. రాజధాని సియోల్ దక్షిణ ప్రాంతంలో ఆరిసెల్ బ్యాటరీ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దాదాపు 35 వేల బ్యాటరీ సెల్స్‌ను ఉంచిన గోదాములో పేలుళ్లు జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోట ఇప్పటివరకు 20 మృతదేహాలను అధికారులు గుర్తించారు. డజన్లకొద్దీ ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లిథియం బ్యాటరీల నుంచి వెలువడే మంటలార్పడానికి డ్రైశాండ్‌ను వినియోగించారు.
నీళ్లు ఈ మంటలను ఆర్పలేవు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది దాకా పని చేస్తున్నారు. వీరిలో 78 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో సహాయక బృందాలు కర్మాగారం లోపలికి చేరుకొని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై దేశాధ్యక్షుడు యూన్‌సుక్ యోల్ స్పందించారు. మంటలను అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో సౌత్ కొరియా ముందుంది.
Comments
Please login to add a commentAdd a comment