5 ట్రిలియన్లు ఎన్నడు? | india 5 trillion economy | Sakshi
Sakshi News home page

5 ట్రిలియన్లు ఎన్నడు?

Published Thu, Feb 29 2024 12:34 PM | Last Updated on Thu, Feb 29 2024 12:44 PM

india 5 trillion economy - Sakshi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ మధ్య ఒక ఇంగ్లిష్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ  భారతదేశ ప్రగతి ఎంతో ఉజ్వలమని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడంలో మన పాత్ర అద్భుతం అని సమాధానం చెప్పారు. 2024 కల్లా భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా బలోపేతమవుతుందని, చాలా బలమైన విశ్వాసాన్ని ప్రకటించారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య ఫెడరల్ వ్యవస్థ ఆదర్శవంతంగా సాగుతోందని కితాబు ఇచ్చారు. వ్యవసాయంలోనూ, కార్మిక రంగంలోనూ తీసుకువచ్చిన సంస్కరణలు గతంలో ఎన్నడూ లేనంత ప్రభావాన్ని చూపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

కరోనా వంటి కష్టకాలంలో, విపత్తుల్లో పేదవాడికి ప్రభుత్వం అందించిన చేయూత అద్భుతమైనదని,ఆత్మతృప్తిని వ్యక్తం చేశారు.ఉత్పత్తి, తయారీ రంగంలో ప్రపంచం మొత్తానికి సరఫరా చేయగలిగిన మార్కెట్ కేంద్రంగా సమీప భవిష్యత్తులో భారత్ నిలుస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు.సంస్కరణల పరంపర నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంటుందని సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా, దానికి తగ్గట్టుగా రాష్ట్రాలు స్పందించక పోతే, ఆశించిన అభివృద్ధి జరగదని తెలిపారు.పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాలు తమ వంతు పాత్ర పోషించడం కీలకమని సూచించారు.

చేయాలనుకున్న మేలు,చిట్ట చివరి మైలు వరకూ చేరుకునే డెలివరీ వ్యవస్థ మనల్ని కాపాడిందని,ఈ యంత్రాంగాన్ని అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లోనే నిర్మించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లిందని తమ పాలన పట్ల అత్యంత ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు.లక్షలాది మంది ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదును బదిలీ చేయగలిగామనే ఆత్మతృప్తి తనకు ఎంతో ఉత్సహాన్ని,శక్తిని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇది తమ ప్రభుత్వం మాత్రమే చేసిన చారిత్రక చర్య అని తెలిపారు.ఇలా,ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన భావాలను, అనుభవాలను,ఆలోచనలను, ఆశయాలను,సంకల్పాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఈ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ ఇంకా సంధించాల్సిన చాలా  ప్రశ్నలు సంధించలేదని చెప్పాలి. ప్రధాని చెప్పిన జవాబుల్లోనూ ఇంకా విస్తృతి వుంటే బాగుండేది. ప్రధానమంత్రి చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలను  సమీక్ష చేసుకుంటే,కొన్ని వాస్తవానికి దగ్గరగానూ,కొన్ని దూరంగానూ ఉన్నాయి.సుమారు 139కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ, మరణాల సంఖ్యను అదుపులో ఉంచడంలోనూ, పరీక్షలు జరపడంలోనూ మంచి ఫలితాలే వచ్చాయి.  ముందుజాగ్రత్త చర్యలు, హెచ్చరికలు చేపట్టకుండా, ఉన్నపళంగా లాక్ డౌన్ విధించడం వల్ల ఎన్నో అనర్ధాలు సంభవించాయి.

ముఖ్యంగా వలసకార్మికులు పడిన కష్టాలు,పోగొట్టుకున్న ప్రాణాలు, కోల్పోయిన ఉపాధి వర్ణనాతీతం. లాక్ డౌన్ వల్ల ఆరోగ్యపరంగా కొంత రక్షణ పొందాం. సమాంతరంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇంత ఘోరమైన ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడూ ఎదుర్కోలేదు.గతంలో ఆర్ధిక మాంద్యం వచ్చిన దశ కంటే, నేటి దశ చాలా ఘోరమైనదిగా విశ్లేషకులు భావించారు. అన్ లాక్ ప్రారంభమైనప్పటి నుంచీ కొంత ప్రగతి నమోదవుతూ వచ్చింది.ఆ సమయంలో నిర్మాణం,ఉత్పత్తి రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆర్ధిక లావాదేవీలు చాలా మందకొడిగా సాగాయి. డిమాండ్-సప్లై మధ్య ఉన్న బంధం ఆరోగ్యకరంగా సాగలేదు.

కరోనా ప్రభావంతో మిగిలిన దేశాల్లో వచ్చిన ఆర్ధిక కష్టాల ప్రభావం మన దేశంపైనా పడింది. దెబ్బతిన్న దేశాల్లో అమెరికా,చైనా వంటి పెద్ద దేశాలు సైతం ఉన్నాయి. అమెరికా బాగా దెబ్బతింది. చైనాకు -భారత్ కు మధ్య ఉన్న వాణిజ్య, వ్యాపార బంధాలు చాలా వరకూ తెగిపోయాయి. ఈ ప్రభావం మన ఉత్పత్తి రంగం, తద్వారా మన ఆర్ధిక రంగంపై పడింది.ఫార్మా మొదలు అనేక తయారీల్లో మనం చైనాపైనే ఆధారపడ్డాం.అదే విధంగా "మేక్ ఇన్ ఇండియా" ను ఆచరణలో ఆశించిన స్థాయిలో సాధించలేదు. కాబట్టి, ఈ పరిణామాల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది. అంతటి గడ్డు పరిస్థితుల్లోనూ మన దేశాన్ని కాపాడింది వ్యవసాయ రంగం. అది ఎంతో కొంత పచ్చగా ఉండడం వల్ల, కొంత ఆర్ధిక రక్షణ జరిగింది.

యత్ర  నార్యంతు పూజ్యతే... అన్నట్లుగా, ఎక్కడైతే వ్యవసాయ రంగం బాగుంటుందో, ఆ క్షేత్రం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ రంగంపై పాలకులకు ఇంకా శ్రద్ధాభక్తులు పెరగాలి. వ్యవసాయం కోసం ఉపయోగించుకోకుండా ఉన్న భూమి ఇంకా చాలా ఉంది. దాన్ని గుర్తించి,వ్యవసాయాన్ని విస్తరించాలి.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు మళ్ళీ ఆందోళనకు దిగారు. సార్వత్రిక ఎన్నికల వేళయ్యింది.  చర్చలు జరిపి శుభం కార్డు వెయ్యాలి.ఆహార రక్షణపై (ఫుడ్ సెక్యూరిటీ) పైనా దృష్టి పెట్టాలి.స్వామినాథన్ వంటి నిపుణులు చేసిన  సూచనలు ఆచరణలో అంతంతమాత్రంగానే ఉన్నాయి.

రాష్ట్రాలకు రావాల్సిన జి ఎస్ టి బకాయిలపై కేంద్రం చెప్పేవి మాటల గారడీ మాత్రమేనని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రుణాల వసతి కల్పించినా, వాడుకునే పరిస్థితి రాష్ట్రాలకు ఏమాత్రం ఉందన్నది సందేహమే. థామస్ రాబర్ట్ మాల్థస్ అనే ఆర్ధిక పండితుడు ఎప్పుడో 200ఏళ్ళ క్రితం చెప్పిన మాటలను దేశాధినేతలు పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది.జనాభా పెరుగుదల సంఖ్య ఆధారంగా, ప్రతి 25సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయని,వాటికి అనుగుణంగా మనం సిద్ధమై ఉండాలని ఆయన హెచ్చరించారు.

ప్రకృతి వైపరీత్యాలు, ఆర్ధిక మాంద్యాలు, కరోనా వైరస్ వంటి ముప్పులు, అనారోగ్యాలు ఎన్నో వస్తూ వుంటాయని,వీటిని గుర్తెరిగి, మనం నడచుకోవాలని ఆయన సూచించాడు.ముందు జాగ్రత్త చర్యలు పాటించక పోవడం వల్ల, ఆర్ధికంగా,మౌలికంగా సంసిద్ధమై ఉండక పోవడం వల్ల, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కుదేలైపోతున్నాం.
మాల్థస్ మహనీయుడి మాటలు ఇప్పటికీ ప్రత్యక్షర, ప్రత్యక్ష సత్యాలుగా నిలుస్తున్నాయి. భారతదేశాన్ని పునర్నిర్మించాలనే సత్ సంకల్పం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉండడం ఎంతో అభినందనీయం,పూజనీయం. ఈ 2024కల్లా 5ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థను నిర్మించాలన్నది ప్రధాని పెట్టుకున్న మహదాశయం.

ప్రపంచ ఆర్ధిక పరిణామాలను గమనిస్తే,2024కల్లా 3 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థకు భారత్ చేరుకుంటే? అది గొప్ప ప్రగతి సందర్భమని ఆర్ధిక శాస్త్రవేత్తలు గతంలో  అభిప్రాయపడ్డారు. నేడు దానిని సాధించాం. ప్రధాని సంకల్పిస్తున్నట్లుగా 5ట్రిలియన్ల వ్యవస్థ నిర్మాణం కావడానికి ఇంకా సమయం పడుతుంది.ప్రస్తుతం 3.7 ట్రిలియన్స్ స్థితిలో వున్నాం. 5 ట్రిలియన్స్ కు చేరుకోవాలంటే? మరో నాలుగైదేళ్లు పడుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

రచయిత : మా శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement