భారత్‌.. మూడో అతిపెద్ద ఎకానమీ! | India set to overtake Japan as third largest economy by 2030 | Sakshi
Sakshi News home page

భారత్‌.. మూడో అతిపెద్ద ఎకానమీ!

Published Wed, Oct 25 2023 1:02 AM | Last Updated on Wed, Oct 25 2023 10:01 AM

India set to overtake Japan as third largest economy by 2030 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ 2030 నాటికి జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ పేర్కొంది. అప్పటికి భారత్‌ స్థూల దేశీయోత్పత్తి 7.3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఇదే జరిగితే ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా తర్వాత భారత్‌ ఎకానమీ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సైతం ఆవిర్భవిస్తుంది.

పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ వృద్ధి రేటును భారత్‌ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న దశాబ్ద కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగే వీలుంది.  2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో భారత్‌ ఎకానమీ వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ తాజా నివేదిక ఏమి చెబుతోందంటే.. 

  • 2023, 2024ల్లో ఎకానమీ వృద్ధి రేటు పటిష్టంగా ఉంటుంది. దేశీయంగా బలమైన వినియోగం దీనికి దోహదపడే అంశం.  
  • గత దశాబ్ద కాలంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం  వేగవంతమైంది. భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం కొనసాగుతోంది.  యువత అధికంగా ఉండడం, వేగంగా పెరుగుతున్న పట్టణ గృహ ఆదాయాలు దేశ పురోగతికి దోహదపడే అంశాలు. మధ్య తరగతి ప్రజల సంఖ్య దేశంలో పెరుగుతుండడం మరో సానుకూల అంశం.  
  • సేవా రంగం సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న  దేశీయ వినియోగ మార్కెట్, పారిశ్రామి క, తయారీ, మౌలిక రంగాలు దేశ పురోగతికి బాటలు వేస్తున్నాయి. ఆయా సానుకూలతలు బహుళజాతి కంపెనీలకు విస్తృతస్థాయిలో  పెట్టుబడులు పెట్టడానికి భారత్‌ గమ్యస్థానంగా మార్చుతోంది.  
  • ప్రస్తుతం దేశంలో పురోగమిస్తున్న డిజిటలైజేషన్‌ ఈ–కామర్స్‌ వృద్ధిని వేగవంతం చేస్తుంది.  రాబోయే దశాబ్దంలో రిటైల్‌ వినియోగదారుల మార్కెట్‌ ధోరణుల మార్పునకు ఆయా అంశాలు దోహదపడతాయి. ఈ పరిణామాలు టెక్నాలజీ, ఈ–కామర్స్‌లో ప్రముఖ ప్రపంచ బహుళజాతి కంపెనీలను భారత మార్కెట్‌కు  ఆకర్షిస్తాయి.  
  • 2030 నాటికి 110 కోట్ల మందికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటుంది. 2020లో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య దాదాపు 50 కోట్లకు ఇది రెట్టింపు.  
  • ఈ–కామర్స్‌ వేగవంతమైన వృద్ధి, 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్‌ టెక్నాలజీకి వినియోగదారులు అధిక సంఖ్యలో మారడం వంటి అంశాలు ఆన్‌లైన్‌ ద్వారా సేవలను విస్తృతం చేసే  యూనికార్న్‌ సంస్థల పురోగతికి దోహదపడతాయి. 
  • భారత్‌లో చోటుచేసుకుంటున్న పలు సానుకూల ఆర్థిక పరిణామాలు ఆటో, ఎల క్ట్రానిక్స్,  కెమికల్స్‌ వంటి తయారీ పరిశ్రమలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అసెట్‌ మేనేజ్‌మెంట్, హెల్త్‌ కేర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి సేవా రంగాల పురోగతికి దోహదపడతాయి. పెట్టుబడులకు సంబంధించి బహుళజాతి కంపెనీలకు అత్యంత ముఖ్యమైన దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్‌లలో ఒకటిగా దేశం మారుతుంది. 

భారత్‌ పురోగతి బాట పటిష్టం: ఆర్థికశాఖ 
భారత్‌ 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ సెపె్టంబర్‌ నెలవారీ సమీక్షా నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం దిగిరావడంసహా భారత్‌ ఆర్థిక ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పశ్చిమాసియా సవాళ్లు, పరిణామాలు అంతర్జాతీయ క్రూడ్‌ ధరలపై ప్రభావం చూ పుతాయని అభిప్రాయపడింది. అమెరికా స్టాక్‌ మార్కె ట్లు బలహీన ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది పూర్తి వాస్తవ రూపం దాల్చితే మిగిలిన మార్కెట్లపైనా ఈ ప్రభావం పడవచ్చని వివరించింది.   

ప్రస్తుతం అయిదో స్థానంలో.. 
భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న  సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్‌ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్‌ (4.2 ట్రిలియన్‌ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్‌ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీతో భారత్‌ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్‌ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement