
మిడిల్‌ఈస్ట్ దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణల వల్ల ప్రపంచ కమోడిటీ, ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇప్పటివరకు పరిమిత ప్రభావం ఉన్నప్పటికీ, ఇంధన మార్కెట్, ఆహార భద్రతపై కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం చూపుతుందని తెలిపింది.
ప్రపంచబ్యాంక్ తాజా కమోడిటీ మార్కెట్లకు సంబంధించి ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత త్రైమాసికంలో చమురు ధరలు సగటున బ్యారెల్‌కు 90 యూఎస్ డాలర్లు ఉంటుందని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడంతో వచ్చే ఏడాది బ్యారెల్‌కు సగటున 81 డాలర్లకు తగ్గుతుంది. ప్రపంచ చమురు సరఫరా రోజుకు 20లక్షల నుంచి 5లక్షల బ్యారెళ్లకు తగ్గుతుందని దాంతో ధరలు 3-13 శాతం పెరుగుతాయని నివేదిక తెలిపింది.
వచ్చే ఏడాది మొత్తం కమోడిటీ ధరలు 4.1 శాతం తగ్గుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రానున్న కాలంలో సరఫరా పెరగడంతో వ్యవసాయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. మూల లోహాల ధరలు 2024లో 5 శాతం తగ్గుతాయని తెలిసింది. అయితే 2025లో మాత్రం వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయని సమాచారం.
మిడిల్‌ఈస్ట్ దేశాల్లో 1970 తర్వాత తాజా యుద్ధ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇందర్మిత్‌గిల్ అన్నారు. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.