ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం వృద్ధి సాధిస్తుందని డెలాయిట్ దక్షిణాసియా సీఈఓ 'రోమల్ శెట్టి' (Romal Shetty) అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం సహేతుకంగా నియంత్రణలో ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్దితో ఇది మరింత ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.
ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వాహన విక్రయాలు మెరుగుపడుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి 7 నుంచి 7.1 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ రాజకీయ పరిణామాలు, ఉక్రెయిన్‌లో ఏర్పడ్డ సంక్షోభం వంటివి చాలా దేశాల జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే, ఇప్పటికే భారతదేశం మెరుగైన స్థితిలో ఉందని శెట్టి పేర్కొన్నారు.
డెలాయిట్ అంచనాల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత్ వృద్ధి 6.7 శాతంగా ఉండవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. మోదీ 3.0 ప్రభుత్వం ఇదే వేగంతో కొనసాగాలని తాను ఆశిస్తున్నానని, ప్రభుత్వ శాఖలలో పనులు కూడా ఎప్పటికప్పుడు పూర్తవ్వాలని రోమల్ అన్నారు.
ఇదీ చదవండి: పెట్టుబడులకు కేంద్రంగా భారత్: పీయూష్ గోయల్
భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. చమురు ధరల క్షీణత భారతదేశానికి ఒక కోణంలో మంచిది. యూఎస్ ఫెడ్ రేటు తగ్గింపు కూడా భారతదేశానికి సానుకూలంగా ఉంటుంది. తలసరి ఆదాయం ఒక నిర్దిష్ట స్థాయి కంటే పెరిగితే, ఆర్థిక వ్యవస్థ కూడా అక్కడ నుండి వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment