వాషింగ్టన్: ప్రవాస భారతీయులు స్వదేశం పట్ల అపారమైన అభిమానం చాటుతున్నారు. కష్టార్జితాన్ని తాముంటున్న చోటే దాచుకోకుండా, స్వదేశానికి పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. స్వదేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మాతృభూమికి నిధులు పంపించడంలో (రెమిటెన్స్‌లు) ప్రపంచదేశాల్లోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు.
2023లో 120 బిలియన్ డాలర్ల (రూ.10లక్షల కోట్లు సుమారు) రెమిటెన్స్‌లను భారత్ అందుకున్నట్టు ప్రపంచబ్యాంక్ తాజాగా ప్రకటించింది. అదే ఏడాది మెక్సికోకు వెళ్లిన 66 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లతో పోల్చిచూస్తే భారత్‌కు రెట్టింపు వచ్చినట్టు తెలిపింది. ఆ తర్వాత చైనాకు 50 బిలియన్ డాలర్లు, ఫిలిప్పీన్స్‌కు 39 బిలియన్ డాలర్లు, పాకిస్థాన్‌కు 27 బిలియన్ డాలర్ల రెమెటెన్స్‌లు వెళ్లాయి.
భారత్‌కు 2023లో అత్యధికంగా అమెరికా, యూఏఈ నుంచే రెమిటెన్స్‌లు వచ్చాయి. సీమాంతర చెల్లింపులకు దీర్హామ్–రూపీలను అనుమతించడంతో అధికారిక ఛానళ్ల ద్వారా వచ్చే రెమిటెన్స్‌లు పెరిగినట్టు ప్రపంచబ్యాంక్ తెలిపింది. ఇక 2024 సంవత్సరంలో భారత్‌కు 3.7 శాతం అధికంగా 124 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లు రావచ్చని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. 2025లో మరో 4 శాతం పెరిగి 129 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది.
భారత్ తన యూపీఐని యూఏఈ, సింగపూర్‌తో అనుసంధానించేందుకు చేపడుతున్న చర్యలు వ్యయాలను తగ్గిస్తుందని, ఇది రెమిటెన్స్‌లను మరింత వేగవంతం చేయవచ్చని తెలిపింది. వలసపోవడం, వారి ద్వారా స్వదేశానికి నిధుల తరలింపు అన్నది ఆర్థిక, మానవాభివృద్ధికి అత్యవసరమని ప్రపంచబ్యాంక్‌లో సామాజిక పరిరక్షణ విభాగం గ్లోబల్ డైరెక్టర్ ఇఫత్ షరీఫ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment