సాధారణ ప్రజలపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వారి ఆదాయ, వ్యయ విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పరోక్ష పన్నుల వల్ల దేశం, సమాజం ఎంతో ప్రభావితం చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకొనేందుకు పరోక్ష పన్నులపై ఆధారపడుతోంది. ప్రభుత్వ ఉత్పత్తుల అమ్మకం, గ్రాంట్లు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్‌లు, వ్యవసాయ ఆధారిత రాబడి, ప్రభుత్వ కాంట్రాక్టులు, పర్యాటకం, హాస్పటాలిటీ..వంటివి కేంద్రానికి ఎన్ని ఆదాయ మార్గాలున్నా అన్నింటిలో జీఎస్టీ వాటాయే అధికం.
దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. రాబడిలో వృద్ధి ఆశాజనకంగా ఉంది. సగటున నెలకు సుమారు రూ.1.6 లక్షల కోట్లకుపైనే ఖజానాకు జమ అవుతోంది. తాజాగా అక్టోబర్ నెలకుగాను రూ.1.72లక్షల కోట్లు జీఎస్టీ వసూలైంది. అయితే ఇది రెండో అత్యధిక జీఎస్టీ వసూళ్లుగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.87లక్షల కోట్లలో గరిష్ఠస్థాయికి చేరింది. ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, యుద్ధం, అనిశ్చితి భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆర్థిక కార్యకలాపాల నమోదు పరిమాణం పెరుగుతోంది. అందుకు సంకేతంగా రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూలవుతుంది. అయితే ఇది ఇండియాతో పాటు ప్రపంచానికీ సానుకూల సంకేతమే. కానీ మొత్తం జీఎస్టీ రాబడిలో అధికభాగాన్ని సమకూరుస్తున్నది మాత్రం పేదలేనని ఆక్స్‌ఫామ్ నివేదించింది.
ఇదీ చదవండి: పోస్ట్ ద్వారా 2,000 నోట్ల మార్పిడి
కరోనా సమయంలో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ కొవిడ్ అనంతరం పుంజుకుంటుంది. కానీ లాక్‌డౌన్ సమయంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. చిన్నగా పరిస్థితులు మెరుగవగానే ఒక్కొక్కటిగా ధరలు పెంచడం ప్రారంభించాయి. ఖాళీగా ఉన్న రోజుల్లోని లోటును సైతం భర్తీ చేసేలా సామాన్యులపై ధరల భారాన్నిమోపాయనే వాదనలు ఉన్నాయి. దాంతో కిరాణా సామగ్రి నుంచి పెట్రో ఉత్పత్తుల వరకు పెరిగిన ధరల భారాన్ని భరిస్తున్న పేద కుటుంబాలే దేశ ఖజానాను నింపుతున్నాయి. కరోనా పరిణామాలు, ద్రవ్యోల్బణం ప్రభావంతో వినిమయ వస్తువుల ధరలన్నీ రెండేళ్లుగా పరుగులు తీస్తున్నాయి. ఆహారం, దుస్తులు, ఇంధనం, ఉక్కు సహా అన్నింటి ధరలూ పెరిగాయి. అధిక జీఎస్టీ వసూళ్లకు దారితీసిన అసలు పరిణామమిదేనని కొందరు చెబుతున్నారు.
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అమెరికాలో సైతం ద్రవ్యోల్బణ భయాలున్నాయి. గ్లోబల్‌గా ఉన్న మిగతా పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. దేశీయంగా వినియోగిస్తున్న వస్తువులు, దిగుమతులు చేసుకుంటున్న వస్తువులపై విధిస్తున్న జీఎస్టీ అనేది విలువ ఆధారిత పన్ను. ఆ వస్తువులు పరిమాణం పెరుగుతున్న కొద్దీ జీఎస్టీ రాబడులూ పెరుగుతుంటాయి. దానికితోడు ధరల పెరుగుదలతో పతాకస్థాయి జీఎస్టీ వసూళ్లవుతున్నాయి. ఇటీవలి కాలంలో మన దిగుమతులు, ఎగుమతులకంటే వేగంగా పెరుగుతున్నాయి. గతేడాది 6 శాతం ఎగుమతులు పెరిగితే, దిగుమతులు మాత్రం 16.5 శాతం హెచ్చయ్యాయి.
వస్తువుల వినియోగం, పెరుగుతున్న ధరల వల్ల జీఎస్టీ నంబర్లు భారీగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది పేదలపాలిట భారంగా మారుతుంది. సంపన్నులు వినియోగించే వస్తు సేవలపై పన్ను రేట్లు అధికంగా, పేదలు ఉపయోగించే వాటిపై తక్కువగా ఉంటాయి. వస్తువులకు అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్న సంపన్నులు జీఎస్టీ చెల్లించడం సులువే. కానీ కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, సంఘటిత, అసంఘటిత రంగాల్లోని ప్రజలు వారికి కేటాయించిన జీఎస్టీ చెల్లించాలంటే అవస్థలు పడాల్సిందే. అయితే ధనికుల కంటే పేద కుటుంబాల సంఖ్య అధికంగా ఉండడంతో జీఎస్టీ భారంలో ఎక్కువ వాటాను పేదలే భరిస్తున్నారని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. పేదలు వినియోగించే వాటిలో ఎక్కువగా నిత్యావసర వస్తువులే అధికంగా ఉంటాయి. ధరలు పెరిగినా వీటికి డిమాండ్ తగ్గదు. దాంతో ఈ వస్తువులు, సేవలకు తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ జీఎస్టీ భారంలో ఎక్కువ వాటా కలిగి ఉంటుంది.
ఇదీ చదడండి: ఉద్యోగ నియామకాలపై జొమాటో కీలక వ్యాఖ్యలు
ఉదాహరణకు ప్యాకింగ్, లేబుళ్లు వేసిన ఆహార ఉత్పత్తులపై అయిదు శాతం జీఎస్టీ ఉంది. ఇందులో పాల ఉత్పత్తులు, గోధుమపిండి వంటివి వస్తాయి. స్టీల్(18 శాతం), సిమెంటు(28 శాతం) వంటి నిర్మాణ సామగ్రిపై అధిక పన్ను భారాన్ని పేదలే భరిస్తున్నారు. సంపన్నులు వినియోగిస్తున్న వస్తువుల తయారీకి ఖర్చు అధికమైనా, ధరలను పెంచేందుకు కంపెనీలు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయి. ఫలితంగా వాటి ధరలు నెమ్మదిగానే పెరుగుతుంటాయి. మరోవైపు, ధనికులు చెల్లించే ఆదాయపు పన్ను రేట్లను పెంచడం కూడా పూర్తిగా సరికాదు. ఎందుకంటే గరిష్ఠ ఆదాయ పన్ను స్లాబులో ఉన్నవారిపై సెస్, సర్‌ఛార్జీలతో కలిపి విధిస్తున్న రేటు ఇప్పటికే చాలా ఎక్కువ.
అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి పరిస్థితుల్లో ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంటుంది. దాంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రైవేటు పెట్టుబడులు అంతంతమాత్రంగా ఉన్నాయి. దానికితోడు కార్పొరేట్ పన్ను రేట్లు పెంచడమూ సత్పలితాలను ఇవ్వదు.
గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంలేదు. పెట్రోలియం ఉత్పత్తులకు జీఎస్టీ వర్తించదు. కానీ ముడిచమురు ధరలు, ఇంధనాలపై కేంద్రం విపరీతంగా విధించే ఎక్సైజ్ సుంకంతో పాటు, రాష్ట్రాలు వడ్డించే విలువ జోడింపు పన్ను(వ్యాట్) ఉంటుంది. ఇవన్నీ కలిసి రవాణా ఖర్చుల్ని పెంచుతాయి. రవాణా సేవలపై 18శాతం జీఎస్టీ పడుతుంది. అధిక రవాణా వ్యయం ప్రతి రంగంలోనూ ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. రోడ్లు, వంతెనల పనుల కాంట్రాక్టులపై 12శాతం జీఎస్టీ ఉంది. ఇది టోల్, ప్రయాణ ఛార్జీలను పెంచుతుంది.
దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వస్తువులపై విధిస్తున్న పన్నులు, దిగుమతి సుంకాలన్నీ ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, పన్నుల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ధనికుల కంటే పేదలపైనే అధికంగా ఉంటుంది. ప్రభుత్వం దిగుమతి చేసుకునే కనీస అవసరాలకు సంబంధించిన వస్తువులపై సుంకాన్ని తగ్గిస్తే వాటి ధరలు కుంగి కొంత మేరకు ప్రజలపై భారం తగ్గుతుంది. మొత్తం పన్ను భారాన్ని తగ్గించే వస్తుసేవలపై అదనపు పన్ను, సర్‌ఛార్జీలను తొలగించినా కొంత ఉపశమనం కలుగుతుంది. ఆహార పదార్థాలు, ఔషధాలపై పన్ను తొలగిస్తే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చౌకగా లభ్యమవుతాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై పన్నుల భారం తగ్గించడం ద్వారా తక్కువ ఆదాయ కుటుంబాలతో పాటు వినియోగదారులందరికీ మేలు జరుగుతుందనే వాదనలు ఉన్నాయి. కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయ పన్ను వంటి ప్రత్యక్ష పన్నులకు సంబంధించి విధానాలు మారాలి. దేశీయ ఉత్పత్తి తగ్గకుండా చూసి ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడం, ఇంధన పన్నులు తగ్గించడం వంటివీ ఉపకరిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment