
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమై.. ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న ఉదయం 11:00 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ సమర్పించనున్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి కేంద్ర బడ్జెట్ 1947 నవంబర్ 26 అప్పటి ఆర్ధిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి సమర్పించారు.
నిజానికి 1860లో బ్రిటిష్ పార్లమెంటేరియన్ జేమ్స్ విల్సన్ మొదటి భారతీయ బడ్జెట్‌ను సమర్పించారు. ఆ సమయంలో దీన్ని కేవలం ఆంగ్లంలో మాత్రమే ముద్రించారు. ఆ తరువాత భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇందులో మార్పులు చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 1955లో బడ్జెట్‌ను మొదటిసారి ఇంగ్లిష్, హిందీ భాషల్లో ముద్రించారు. ఈ విధానానికి అప్పటి ఆర్థిక మంత్రి సీడీ దేశ్‌ముఖ్ శ్రీకారం చుట్టారు.
సీడీ దేశ్‌ముఖ్ ప్రముఖ ఆర్థికవేత్త.. ఆర్థిక మంత్రిగా గణనీయమైన కృషి చేశారు. అతను భారతదేశ మొదటి పంచవర్ష ప్రణాళికలను రూపొందించడంలో కూడా సహాయం చేసారు. ఇది పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించింది. ఆర్థిక రంగాన్ని సంస్కరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను బలమైన అథారిటీగా స్థాపించడంలో కూడా దేశ్‌ముఖ్ కృషి అనన్యసామాన్యమనే చెప్పాలి.
ఇదీ చదవండి: బడ్జెట్.. 1999 ముందు వరకు ఒక లెక్క... తర్వాత ఒక లెక్క!
ఆ తరువాత కాలక్రమంలో బడ్జెట్ ముద్రణలో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. 2019లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పేపర్‌లెస్ బడ్జెట్‌గా (డిజిటల్ టాబ్లెట్‌ను ఉపయోగించారు) సమర్పించారు. ఆ తరువాత 2020 బడ్జెట్ ప్రసంగం భారతీయ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైనది రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు సాగింది.