ప్రతి ఏడాది మునుపటి సంవత్సరం కంటే భిన్నంగా ఉంటుంది. 2024 కూడా అంతే. 2023తో పోలిస్తే కొన్ని మార్పులు సహజం. ఇవన్నీ అందరి జీవితాలపై ఎంతోకొంత ప్రభావం చూపుతాయి. ఆర్థిక అవగాహనతో సమాజంలో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తాయి. అయితే జనవరి 1, 2024 నుంచి వచ్చే కొన్ని ప్రధాన మార్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పెరిగిన కార్ల ధరలు
టాటా మోటార్స్, మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా వంటి చాలా ఆటో కంపెనీలు జనవరి 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతామని ప్రకటించాయి. అధిక ఇన్‌పుట్ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేశాయి. ధరల పెంపు దాదాపు 2-3 శాతం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని మోడళ్లకు అధిక ధరల పెంపు ఉండవచ్చని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు.
యూపీఐ ఐడీలు రద్దు
ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లైన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లలోని యూపీఐ ఖాతాను ఒక సంవత్సరం పాటు ఉపయోగించకుంటే, ఇక నుంచి అది పనిచేయదు. ఇలాంటి ఐడీలను జనవరి ఒకటో తేదీ నుంచే డీయాక్టివేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి ఈ ఏడాది నవంబర్ ఏడో తేదీన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఒక ప్రకటన జారీ చేసింది. లావాదేవీలు నిర్వహించని కస్టమర్‌ల ఫోన్ నంబర్లతో మోసాలు జరగకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. కావాలంటే వాటిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది.
సులభమైన భాషలో బీమా వివరాలు
2024 జనవరి 1 నుంచి ఆరోగ్య బీమా పాలసీదారుల కోసం రివైజ్డ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌లను (సీఐఎస్) విడుదల చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవెలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఇన్సూరెన్స్ సంస్థలను ఆదేశించింది. కస్టమర్‌లు పాలసీలోని ముఖ్య విషయాలను సులభంగా అర్థం చేసుకునేలా చేయడం దీని లక్ష్యం. సులభమైన భాషలో అన్నింటినీ వివరించాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. జనవరి 31 లాస్ట్ డేట్!
డిజిటల్ కేవైసీ
ఇకపై మొబైల్ కనెక్షన్‌ల కోసం సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే విధానం మారుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఆదేశాల ప్రకారం.. కస్టమర్‌లకు సిమ్ కార్డ్‌లను విక్రయించే ముందు వారి ఫిజికల్ వెరిఫికేషన్‌ను దశలవారీగా తొలగించాలని టెలికమ్యూనికేషన్ కంపెనీలను ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవైసీ వెరిఫికేషన్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. కస్టమర్‌లు తమ ఫొటో గుర్తింపు రుజువును చూపించి, డిజిటల్‌గా వెరిఫికేషన్ చేయించుకోవాలి. సిమ్ కార్డ్ మోసాలను అరికట్టడానికి ఈ చర్య ఒక మార్గమని డాట్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment