భవిష్యత్తులో దేశ ఆర్థిక వృద్ధి పట్ల ఆశావహంగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే అదే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది. సరిపడా వర్షాలు, రిజర్వాయర్లలో మెరుగైన నీటి నిల్వలు, కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) పెంచడం, ముడి సరుకుల లభ్యత ఇవన్నీ ఆర్థిక వృద్ధికి సానుకూల అంశాలుగా పేర్కొంది.
‘ప్రస్తుతం కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, మెరుగైన వ్యవసాయ ఉత్పాదకత వల్ల రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం దిగొస్తుంది. నవంబర్ నెల ప్రారంభ ధోరణులు కీలక ఆహార ధరలు మోస్తరు స్థాయికి చేరుతున్నట్టు సంకేతమిస్తున్నాయి. అయినప్పటికీ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం దేశీయంగా ద్రవ్యోల్బణం, సరఫరా వ్యవస్థలపై కొనసాగుతుంది’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదిక వెల్లడించింది. ఖరీఫ్ సీజన్‌లో పెద్ద ఎత్తున పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాలు వర్షాకాలంలో కొంత నిదానించినప్పటికీ, తిరిగి అక్టోబర్‌లో పుంజుకున్నట్టు కొన్ని సంకేతాలు వస్తున్నట్లు తెలిపింది. గ్రామీణ, పట్టణ డిమాండ్‌తోపాటు, పీఎంఐ సూచీ, ఈవే బిల్లుల జారీ తదితర సంకేతాలను ప్రస్తావించింది.
ఉపాధి విస్తరణ..
సంఘటిత రంగంలో ఉద్యోగుల సంఖ్య విస్తరిస్తోందని.. తయారీ రంగంలో చెప్పుకోతగ్గ మేర ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నట్టు ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో డిమాండ్ తగ్గడం వల్ల దేశ ఎగుమతులు పుంజుకునే విషయంలో సవాళ్లను ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. మరోవైపు సేవల రంగం ఊపందుకుంటున్నట్టు తెలిపింది. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐలు) చెప్పుకోతగ్గ వృద్ధి లేదని వెల్లడించింది. విదేశీ మారకం నిల్వలు ఈ ఏడాది ఇప్పటి వరకు 64.8 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్టు, చైనా తర్వాత అధిక వృద్ధి నమోదైనట్టు తెలిపింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, కంపెనీల ఆదాయాల వృద్ధి, విలువలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ట్రంప్ సర్కారు విధాన నిర్ణయాలు తదుపరి విదేశీ పెట్టుబడుల రాకను ప్రభావితం చేస్తాయని వివరించింది.
ఇదీ చదవండి: ఆకాశవీధిలో 1.36 కోట్ల మంది
అంతర్జాతీయ పరిణామాలు..
రష్యా–ఉక్రెయిన్ మధ్య తాజా ఉద్రిక్తతలతో ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళనకు దారితీసిందని, దీంతో భద్రత ఎక్కువ ఉండే సాధనాలైన యూఎస్ ట్రెజరీలు, బంగారానికి డిమాండ్ ఏర్పడినట్టు ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. యూరప్, చైనాలో ఆర్థిక మందగమనం ప్రభావం అంతర్జాతీయ వృద్ధిపై కొనసాగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి పనితీరు చూపిస్తున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment