డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తే దేశం వృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సమ్మిళిత వృద్ధికి అనువైన చట్టాలను సరళీకరిస్తూ దేశం ఆర్థికంగా దూసుకుపోతోందని తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.
‘ఉపాధి కల్పన, ఉత్పత్తి విలువను పెంచే పీఎల్‌ఐ ప్రోత్సాహకాలు దేశవృద్ధికి ఎంతో ఉపకరిస్తున్నాయి. దేశీయంగా తయారీ రంగం ఊపందుకుంటుంది. మొబైల్, సెమీకండక్టర్లు వంటి తయారీ రంగాల్లో రానున్న రోజుల్లో ఎంతో వృద్ధి నమోదవుతుంది. ప్రభుత్వం భౌతిక, డిజిటల్ ఆస్తులపైనే కాకుండా సామాజిక వనరులపై కూడా పెట్టుబడి పెడుతుంది. గత పదేళ్లలో మెడికల్ కాలేజీలు దాదాపు రెట్టింపు పెరిగి 706కు చేరుకున్నాయి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సంఖ్య ఏడు నుంచి 22కు చేరింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా కొత్త పరిశ్రమలను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దాంతో పెద్ద మొత్తంలో ఉపాధి లభిస్తుంది. ఉత్పాదకత పెంపొందుతుంది. మొబైల్ ఫోన్ తయారీకి సంబంధించిన పీఎల్‌ఐల వల్ల గత దశాబ్దంలో 12 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు నమోదయ్యాయి. దేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్ల మొత్తం ఉత్పత్తి విలువ 2014లో 2.3 బిలియన్ డాలర్లు(రూ.19.3 వేలకోట్లు)గా ఉండేది. 2024 నాటికి అది రూ.4.1 లక్షల కోట్లకు పెరిగింది’ అన్నారు.
ఇదీ చదవండి: సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలు
‘ఈ సంవత్సరం యాపిల్ సంస్థ దేశంలో తమ సరికొత్త మోడల్‌ను తయారు చేయనుంది. గత దశాబ్దంలో మొబైల్ ఫోన్ తయారీలో దేశం గణనీయ వృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత భారత్ ఈ రంగంలో రెండో స్థానానికి చేరుకుంది. పీఎల్‌ఐకు సంబంధించి మొబైల్ తయారీ విభాగం విజయవంతం కావడంతో సెమీకండక్టర్ చిప్ తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది. సెమీకండక్టర్ డిజైన్, ఏటీఎంపీ(అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్)లో వృద్ధి నమోదు కానుంది. ఈ రెండు పరిశ్రమలకు అనుబంధంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను ప్రారంభించనున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.40 వేలకోట్లు కేటాయించనుంది. సమ్మిళిత వృద్దికి అవసరమయ్యే చట్టాలను సరళీకరిస్తూ దేశం ఆర్థికంగా దూసుకుపోతుంది’ అని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment