
వాషింగ్టన్: జో బైడెన్.. అమెరికాకు అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. 78 ఏళ్ల వయసులో స్వల్ప అనారోగ్య సమస్యలు సహజమే అయినా అగ్రరాజ్యాధిపతిగా ఆయన ఆరోగ్యంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే బైడెన్ ఈ మధ్య తరచుగా తడబడుతున్నారు. పేర్లు, హోదాలు చెప్పే విషయంలోనూ తికమక పడుతున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ప్రెసిడెంట్ హ్యారిస్ అని సంబోధించారు. శుక్రవారం తన అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి అట్లాంటాకు ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బయలుదేరిన బైడెన్ మెట్లపై పలుమార్లు కిందపడ్డారు. అతికష్టం మీద రెయిలింగ్ పట్టుకొని పైకి లేచారు. ఇలా వరుసగా మూడు సార్లు జరగడం గమనార్హం. దీంతో ఆయన ఆరోగ్యంపై అమెరికా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.