వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానం సరికొత్తగా, సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనుంది. ఎయిర్‌ఫోర్స్‌వన్‌గా ప్రస్తుతం 747–200 రకం బోయింగ్‌లను వాడుతున్నారు. ఇవి 1989–1993 మధ్య అధ్యక్షునిగా చేసిన జార్జి హెచ్.డబ్ల్యూ.బుష్ హయాంవి. వీటి స్థానంలో ఆధునీకరించిన రెండు 747–800 రకం విమానాలను ఎయిర్‌ఫోర్స్‌వన్ కోసం బోయింగ్ సంస్థ సిద్ధం చేయనుంది.
సరికొత్త హంగులతో తొలి విమానం 2027లో, రెండోది 2028కల్లా అందుతాయి. విమానం వెలుపలి భాగం రంగులను అలాగే ఉంచాలని తాజాగా నిర్ణయించారు. అయితే అధ్యక్షుడు బైడెన్ సూచన మేరకు ప్రస్తుత రాబిన్ ఎగ్ బ్లూ బదులుగా బ్లూ, వైట్ రంగులు వాడతారు. సకల సౌకర్యాలు, ప్రపంచంలోనే అత్యంత హెచ్చు భద్రతతో కూడిన ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానాలను బోయింగ్ సంస్థే తయారు చేస్తూ వస్తోంది. ప్రస్తుత విమానాలను మార్చి కొత్తవి తీసుకోవాలని ట్రంప్ హయాంలోనే నిర్ణయించారు. వాటికి రెడ్–వైట్–బ్లూ– రంగులు వేయాలని అప్పట్లో ట్రంప్ ఆదేశించారు. ఇది ఆయన వ్యక్తిగత విమానం డిజైనే! ఈ ముదురు రంగుల వాడకంతో ఖర్చు పెరగడంతోపాటు డెలివరీ ఆలస్యమవుతుందని బోయింగ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రంగు మార్పు వద్దని బైడెన్ నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment