Boeing 747
-
నయా ఎయిర్‌ఫోర్స్‌వన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానం సరికొత్తగా, సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనుంది. ఎయిర్‌ఫోర్స్‌వన్‌గా ప్రస్తుతం 747–200 రకం బోయింగ్‌లను వాడుతున్నారు. ఇవి 1989–1993 మధ్య అధ్యక్షునిగా చేసిన జార్జి హెచ్.డబ్ల్యూ.బుష్ హయాంవి. వీటి స్థానంలో ఆధునీకరించిన రెండు 747–800 రకం విమానాలను ఎయిర్‌ఫోర్స్‌వన్ కోసం బోయింగ్ సంస్థ సిద్ధం చేయనుంది. సరికొత్త హంగులతో తొలి విమానం 2027లో, రెండోది 2028కల్లా అందుతాయి. విమానం వెలుపలి భాగం రంగులను అలాగే ఉంచాలని తాజాగా నిర్ణయించారు. అయితే అధ్యక్షుడు బైడెన్ సూచన మేరకు ప్రస్తుత రాబిన్ ఎగ్ బ్లూ బదులుగా బ్లూ, వైట్ రంగులు వాడతారు. సకల సౌకర్యాలు, ప్రపంచంలోనే అత్యంత హెచ్చు భద్రతతో కూడిన ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానాలను బోయింగ్ సంస్థే తయారు చేస్తూ వస్తోంది. ప్రస్తుత విమానాలను మార్చి కొత్తవి తీసుకోవాలని ట్రంప్ హయాంలోనే నిర్ణయించారు. వాటికి రెడ్–వైట్–బ్లూ– రంగులు వేయాలని అప్పట్లో ట్రంప్ ఆదేశించారు. ఇది ఆయన వ్యక్తిగత విమానం డిజైనే! ఈ ముదురు రంగుల వాడకంతో ఖర్చు పెరగడంతోపాటు డెలివరీ ఆలస్యమవుతుందని బోయింగ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రంగు మార్పు వద్దని బైడెన్ నిర్ణయించారు. -
రాణి వెడలె.. బై బై బోయింగ్ 747
విమానయాన చరిత్రలో మహరాణిగా వెలుగొందిన బోయింగ్ 747 విమానం కథ కంచికి చేరింది. 50 ఏళ్లకు పైగా అద్భుతమైన సేవలతో అలరించిన ఈ విమానాల తయారీని బోయింగ్ నిలిపేసింది. చిట్టచివరి విమానం డెలివరీ కూడా తాజాగా జరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 పై చిలుకు బోయింగ్ 747లు సేవలందిస్తున్నాయి. అవన్నీ పూర్తిగా మూలకు పడ్డ అనంతరం ఈ ముచ్చటైన మోడల్ శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి జారుకుంటుంది... 1968, సెప్టెంబర్ 30 అమెరికాలోని వాషింగ్టన్ ఎవెరెట్టెలో కంపెనీ ప్లాంట్ బోయింగ్ 747 మొట్టమొదటి విమానం రాచఠీవితో నిల్చొని ఉంది. భారీ రెక్కలతో ఇంద్రభవనంలా మెరిసిపోతున్న ఆ విమానాన్ని చూడానికి వేలాది మంది అక్కడికి తరలివచ్చారు. అంత పెద్ద విమానాన్ని అప్పటివరకు చూసి ఎరుగని జనం దానినో అద్భుతంలా చూడసాగారు. భవనం లాంటి విమానం అసలు గాల్లో ఎలా ఎగరగలదని చర్చించుకోవడం మొదలు పెట్టారు. అప్పట్నుంచి ఈ విమానం అంతర్జాతీయ ప్రయాణ రూపురేఖల్ని మార్చేసింది. అందుకే బోయింగ్ 747ని క్వీన్ ఆఫ్ స్కైస్ అని పిలుస్తారు. 2023, ఫిబ్రవరి 1 55 సంవత్సరాల తర్వాత.. సరిగ్గా అదే స్థలం ఆకాశానికి రాణిలాంటి బోయింగ్ 747కి సిబ్బంది ఘనమైన వీడ్కోలు పలికారు. చిట్టచివరి విమానాన్ని గురువారం అట్లాస్ ఎయిర్‌లైన్స్ సంస్థకు అందజేశారు. ప్రయాణికుల విమానంగా మొదలైన దాని ప్రస్థానం కార్గో విమానంగా ముగిసింది. వీటి తయారీ నిలిపివేస్తున్నట్టు 2020లోనే కంపెనీ ప్రకటించింది. వేలాది మంది ఉద్యోగులతో పాటు ఔత్సాహికులు ఈ వీడ్కోలు కార్యక్రమానికి తరలి వచ్చారు. అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన విమానాన్ని మళ్లీ చూడలేమని బాధాతప్త హృదయంతో చర్చించుకున్నారు. విమానమే ఒక ఇంద్రభవనం విమాన ప్రయాణాల చరిత్రలో బోయింగ్‌కి ముందు, బోయింగ్ తర్వాత అని స్పష్టమైన విభజన రేఖ గీయొచ్చు. గంటల తరబడి కూర్చొని దేశ విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణాలు బోయింగ్ రాకతో అత్యంత సౌకర్యవంతంగా మారాయి. సువిశాలంగా ఉండే బోయింగ్ 747 ఎదుట ఇతర విమానాలు ఒక మరుగుజ్జుగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బోయింగ్ విమానం ప్రపంచాన్ని కుదించింది. కళ్లు చెదిరే సదుపాయాలతో వీవీఐపీ ప్రయాణికులు మోజు పడేలా 747 విమానాలు రూపుదిద్దుకున్నాయి. బార్లు, డైనింగ్ హాళ్లు, మూవీ స్క్రీన్లు, లగ్జరీ ఇంటీరియర్లు, లాంజ్‌లు, లివింగ్ రూమ్‌లు ఒకటేమిటి ఇదసలువిమానమా, గాల్లో ఎగిరే ఇంద్రభవనమా అని అందరూ అవాక్కయ్యారు. తయారీ నిలిపివేత ఎందుకు? అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. బోయింగ్ విమానానికయ్యే ఇంధనం ఖర్చు చాలా ఎక్కువ. 2007లో ఏ380 ఎయిర్ బస్ వచ్చిన దాకా బోయింగ్ 747 ప్రభ వెలిగిపోతూనే ఉంది. చమురు రేట్లు ఆకాశాన్నంటుతూ ఉండడంతో బోయింగ్ 747 కొనుగోలు చేసే ఎయిర్‌లైన్స్ సంస్థలు కరువయ్యాయి. యూరప్‌కి చెందిన ప్రత్యర్థి కంపెనీ ఎయిర్‌బస్ తక్కువ చమురు ఖర్చుతో విమానాలు రూపొందించడంతో బోయింగ్ డిమాండ్ పడిపోయింది. ఏ ఎయిర్‌లైన్స్ కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దీంతో 2020లో బోయింగ్ 747 విమానాల తయారీ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రత్యామ్నాయం ఏంటి ? జంబో జెట్లతో చమురు ధరాభారం ఎక్కువగానే ఉన్నా అత్యంత పెద్ద విమానాన్ని రూపొందించడానికి బోయింగ్ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. రెండు ఇంజిన్లు ఉండే 776ఎక్స్ అని పిలిచే ఈ సరికొత్త జంబో జెట్ 2020లోనే మార్కెట్లోకి రావాల్సి ఉండేది. కానీ కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాలు పడడంతో విమానాల తయారీ ఆలస్యమవుతోంది. 2025 నాటికి ఈ సరికొత్త విమానాలు తేవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొట్ట మొదటి విమానం ఇలా..! బోయింగ్ 747 కంటే ముందు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన 707 బోయింగ్ విమానం చాలా ఇరుగ్గా ఉండేది. సీట్ల మధ్య రాకపోకలు సాగించడానికి ఒక్కటే మార్గం ఉండేది. దీంతో విమాన ప్రయాణాలపై ప్రజలకి ఒక రకమైన వ్యతిరేకత నెలకొంది. బోయింగ్ 747 రెండు అంతస్తులుతో, నడిచి వెళ్లడానికి రెండు మార్గాలతో అత్యంత సువిశాలంగా ఉండేది. బోయింగ్ 707 విమానం 200 మంది కంటే తక్కువ మంది ప్రయాణికులతో ఏకబిగిన 3 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తే, 400 మంది ప్రయాణికుల్ని మోసుకువెళుతూ బోయింగ్ 747 ఏకబిగిన 5వేల నాటికన్ మైళ్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఎన్నో ప్రత్యేకతలు ► మొట్టమొదటి విమానాన్ని పాన్ యామ్ సంస్థ జనవరి 15, 1970లో కొనుగోలు చేసింది. తొలిసారి నిర్మించిన 747 విమానం 225 అడుగుల పొడవు ఉంది. దాని తోకభాగం ఆరు అంతస్తుల భవనం ఎంత పొడవు ఉంటుందో అంత ఉండేది. ► జంబో జెట్‌కి చమురు ఖర్చు ఎక్కువ కావడంతో డిజైన్ రూపొందించినప్పుడే కార్గో అవసరాలకు మార్చుకునే విధంగా రూపొందించారు. 3,400 బ్యాగేజ్‌లను తీసుకువెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. అదే ఈ విమానాలను ఇన్నాళ్లూ కాపాడుతూ వచ్చింది. ► 1990లో తొలిసారిగా బోయింగ్ 747–200 విమానాన్ని అమెరికా అధ్యక్షుడు వాడే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంగా మార్చారు. ► ఇప్పటివరకు 1,574 విమానాలను తయారు చేశారు. ఇప్పటికీ 500 విమానాలు వాడుకలో ఉన్నాయి. ► ప్రయాణికుల, రవాణాతో పాటు అవసరమైనప్పుడు అంతరిక్షం నుంచి రాకపోకలకి అనుగుణంగా ఈ విమానాన్ని ఆధునీకరించారు. ► ఎయిర్ ఇండియా కూడా ఈ విమానాలను కొనుగోలు చేసి విస్తృతంగా వినియోగించింది. 1971లో తొలి విమానాన్ని కొనుగోలు చేసింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ విమాన సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే..!
వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24న భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ దంపతులు భారత్ పర్యటనకు రానున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వారు ఈ విమానంలోనే వెళ్తుంటారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుని ఎయిర్ ఫోర్స్ వన్ ఇది వరకు పనిచేసిన అధ్యక్షుల విమానాలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న బోయింగ్ 747-200బీ విమానం అత్యంత శక్తివంతమైనది. అతి పెద్ద అధ్యక్ష విమానం కూడా ఇదే. అధ్యక్షలుగా ఉండే వారు ప్రయాణాలకు వివియోగించే విమానాలలో లాంగ్ రేంజ్ గల విమానం ఇది. అమెరికా అధ్యక్షుడు ఉండే భవనం శ్వేత సౌధం అయితే.. ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎగిరే శ్వేత సౌధంగా చెప్పవచ్చు. చదవండి: ట్రంప్ మూడు గంటల పర్యటన ఖర్చెంతో తెలుసా..! ఇందులోని సౌకర్యాలను ఒకసారి పరిశీలిస్తే.. గగనతలంలో ఇంధనం నింపే సౌకర్యం కలదు. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. దీనిని మూడు భాగాలుగా విభజించి కాన్ఫరెన్స్ హాల్, డైనింగ్ రూమ్, అధ్యక్షుడు, అతని సతీమణికి ప్రత్యేక గదులు, సీనియర్ స్టాఫ్‌కు ప్రత్యేక గదులు, వైద్య అవసరాల నిమిత్తం ప్రత్యేక గది, అధ్యక్షుడి సలహాదారులకు, ఎయిర్ ఫోర్స్ వన్ ఉద్యోగులకు, మీడియాకు ఇలా వేరువేరు గదులు ఉంటాయి. ఒకేసారి 100 మంది భోజనం చేసే విధంగా ప్రత్యేక డైనింగ్ సదుపాయం కలదు. భద్రత విషయానికొస్తే అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీ దీని సొంతం. హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థ కలదు. ఎయిర్‌ఫోర్స్ వన్‌పై దాడులు జరిగితే మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు కలవు. 747-200బీ రెక్కల పొడవు 195 అడుగులు కాగా.. ఇది టేకాఫ్ తీసుకునేటపుడు మోయగలిగే బరువు 8,33,000 పౌండ్లు ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ఉండే భవనం శ్వేత సౌధం అయితే.. ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎగిరే శ్వేత సౌధంగా చెప్పవచ్చు. చదవండి: 'ట్రంప్ పర్యటనంటే ఆ మాత్రం ఉండాలి మరి' -
మన్మోహన్ సింగ్ విమానం ల్యాండవుతుండగా..!
న్యూఢిల్లీ: అది 2007 నవంబర్ 11.. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రష్యాలో అధికారిక పర్యటన కోసం ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. ప్రధాని ప్రయాణిస్తున్న ఈ వీవీఐపీ విమానం సరిగ్గా మాస్కో విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయానికి సాంకేతికలోపం తలెత్తింది. బోయింగ్ 747 విమానం ల్యాండింగ్ గేర్ సరిగ్గా పనిచేయలేదు. మాస్కో ఏటీసీ సిబ్బంది వెంటనే విమాన పైలట్లకు సమాచారమిచ్చారు. కాక్‌పిట్‌లో వార్నింగ్ లైట్స్ వెలిగాయి. అందరిలో ఉత్కంఠ రేపిన ఈ ఘటనకు సంబంధించిన ఫ్లయింట్ డాటా రికార్డర్ (ఎఫ్డీఆర్)ను తాజాగా ఓ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. మాస్కో విమానాశ్రయంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రయాణిస్తున్న విమానం దాదాపు క్రాష్ అయ్యే పరిస్థితి తలెత్తింది. చివరినిమిషంలో సరైన చర్యలు (కరెక్టివ్ యాక్షన్స్) తీసుకోవడం వల్ల ఈ ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ కావడానికి అవసరమైన లోయర్ గేర్.. ‘ఎలక్ట్రానిక్ గ్లైడ్ స్లోప్’కు కొంత ఎత్తులో ఉన్నంతవరకు పనిచేయలేదు. రన్‌వేపై విమానం ల్యాండవుతున్నప్పుడు వాటి టైర్లు సున్నితంగా నేలను తాకేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ గ్లైడ్ స్లోప్ ఉంటుంది. చివరినిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ వీవీఐపీ విమాన ల్యాండింగ్ ఘటనలో భద్రతా నిబంధనలను ఏమైనా ఉల్లంఘించారా? అనే అంశంపై సదరు జాతీయ పత్రిక ఆరాతీయగా.. విమానం దిగుతున్నప్పుడు రన్‌వేకు తక్కువ ఎత్తులో ఉన్నంతవరకు కరెక్టివ్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చునని, అందువల్లే ఏటీసీ హెచ్చరికలు జారీచేయడం, కాక్‌పిట్‌లో ప్రమాదఘంటికలు మోగించడం వంటివి జరిగి ఉండవచ్చునని ఓ సీనియర్ పైలట్ తెలిపారు. పైలట్లు లోయర్ గేర్‌ను ఆలస్యంగా వినియోగించడం కూడా ఈ ఘటనకు కారణమై ఉండొచ్చునని చెప్పారు.