పట్టువదలని ట్రంప్
► కొత్త వలస నిషేధ ఉత్తర్వుల జారీకి కసరత్తు
► వలస చట్టాల అమలును కఠినతరం చేస్తామని వెల్లడి
వాషింగ్టన్ : కోర్టుల్లో వరుసగా షాక్‌లు తగులుతున్నా... నిషేధపు ఉత్తర్వులపై మాత్రం వెనక్కి తగ్గనంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్వల్ప మార్పులతో వచ్చే వారం కొత్త ఉత్తర్వులు జారీ చేస్తానని శనివారం ఆయన స్పష్టం చేశారు. ఏడు ముస్లిం దేశాల పౌరుల రాకను నిషేధిస్తూ జారీచేసిన ఉత్తర్వుల్ని కోర్టులు రద్దు చేసిన నేపథ్యంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునే లక్ష్యంతో ట్రంప్ ముందడుగు వేస్తున్నారు. ‘ఈ యుద్ధంలో మేం గెలుస్తాం. అందుకు కొంత సమయం పట్టినా మాదే విజయం. ఇందుకోసం ఇతర ప్రత్యామ్నాయాల్ని కూడా పరిశీలిస్తున్నాం... అందులో ఒకటి కొత్త ఉత్తర్వులు జారీచేయడం’అని ట్రంప్ పేర్కొన్నారు.
ఎయిర్‌ఫోర్స్ వన్ లో జపాన్ అధ్యక్షుడు షింజో అబేతో కలిసి ఫ్లోరిడాకు వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసే ఆలోచన ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘దాదాపు అలాంటిదే... భద్రత కోసం చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరముంది. కోర్టు నిర్ణయంపై ఎలా ముందుకెళ్లాలనే నిర్ణయంపై వచ్చే వారం వరకూ వేచి చూస్తా. అది సోమవారం లేదా మంగళవారం కావచ్చు’అని ట్రంప్ వెల్లడించారు.
ఇక నుంచి క్షుణ్నంగా తనిఖీలు: ట్రంప్
కొత్త ఉత్తర్వుల వివరాలు వెల్లడిస్తూ... వలస చట్టం అమలు కోసం పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘కొత్తగా భద్రతా చర్యలు పొందుపరుస్తాం. ఇక నుంచి చాలా క్షుణ్నంగా తనిఖీ చేయబోతున్నాం. మన దేశానికి రావాలనుకుంటున్న ప్రజలు మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేలా ఉండాలి’అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు శుక్రవారం వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ... అమెరికాకు అదనపు భద్రత కోసం ఏదొకటి చాలా త్వరగా చేయాలని, వచ్చేవారం వాటిని మీరు చూస్తారంటూ దీమాగా చెప్పారు. ‘కోర్టులో పోరాటాన్ని కొనసాగిస్తాం. కేసు గెలుపుపై నాకు ఎలాంటి సందేహం లేదు’అని జపాన్ ప్రధాని షింజో అబేతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
దేశ భద్రత కోసమే అధ్యక్షుడినయ్యా...
‘మనం దేశాన్ని సురక్షితంగా ఉంచాలనుకుంటున్నాం. దేశ భద్రత కోసం ఏది అవసరమో అది చేయాలనుకుంటున్నాం. మన నిర్ణయం విజయవంతమవుతుందని భావించాం.. అయితే ఇంత సమయం తీసుకోకూడదు. ఎందుకంటే దేశ భద్రతే మనకు ముఖ్యం. ఈ రోజున నేను ఇక్కడ ఉన్నానంటే అది దేశ భద్రత కోసమే.. నేను భద్రత ఇవ్వగలనని ఓటర్లు నమ్మారు’ అని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ఎన్నో ముప్పులు పొంచి ఉన్నాయని, అలా జరిగేందుకు అనుమతించకూడదన్నారు. అధ్యక్షుడిగా చాలా తక్కువ సమయంలోనే అనేక విషయాల్ని నేర్చుకున్నానంటూ తన అనుభవాలు వెల్లడించారు.
వాటికి నా దెబ్బ రుచిచూపిస్తా
విదేశాలకు వ్యాపారాల్ని తరలించాలనే ఆలోచనలో ఉన్న కంపెనీలకు నిబంధనల్ని కఠినతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. కేవలం బై బై చెప్పి, అందర్నీ ఉద్యోగాల నుంచి తొలగించి వెళ్లిపోవడం అంత సులువు కాదనే విషయం ఆ కంపెనీలకు తెలిసేలా చేస్తానన్నారు. అమెరికా ప్రజల్ని ఉద్దేశించి శనివారం వారాంతపు ప్రసంగం చేస్తూ... భారీ పన్ను సంస్కరణల కోసం కసరత్తులు చేస్తున్నామని వెల్లడించారు. కొత్త పన్ను విధానాలు అమల్లోకి వస్తే ఉద్యోగులపై, వ్యాపారులపై భారం తగ్గుతుందని చెప్పారు. అమెరికాలో వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలనేది ప్రభుత్వ అభిమతమని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.