మీ పోలీసా.. మా పోలీసా?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య మరోసారి చిచ్చురేగింది. ఢిల్లీ ఏసీబీ చీఫ్గా ఢిల్లీ పోలీసు విభాగంలోని జాయింట్ కమిషనర్ ఎంకే మీనాను నజీబ్ జంగ్ నియమించారు. అయితే, సీఎం కేజ్రీవాల్ మాత్రం అదనపు కమిషనర్ ఎస్ఎస్ యాదవ్ను ఎంచుకున్నారు. సీనియారిటీ ప్రకారం చూస్తే, మీనాయే ఏసీబీకి బాస్ అవ్వాల్సి ఉంది.
మీనా నియామకంపై ఆప్ వర్గాలు మండిపడుతున్నాయి. దీన్ని ఊరికే వదిలేది లేదని, కోర్టులో తేల్చుకుంటామని నాయకులు అంటున్నారు. ఈ నియామకం అక్రమమని, అసలు ఏసీబీలో జాయింట్ కమిషనర్ పదవే లేనప్పుడు.. అలాంటి పోస్టులను ఎలా సృష్టిస్తారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అన్నారు. కానీ, అవినీతిపై పోరాడేందుకు ఢిల్లీ ప్రభుత్వంలోని ఏసీబీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఒక జాయింట్ కమిషనర్ను, ఏడుగురు ఇన్స్పెక్టర్లను ఆ విభాగంలోకి నియమించినట్లు ఢిల్లీ పోలీసు విభాగం సోమవారం ప్రకటించింది. అవసరమైతే మరింతమందిని కూడా ఆ విభాగంలోకి పంపుతామని తెలిపారు.