మళ్లీ ట్రామ్ పరుగులు! | again trom | Sakshi
Sakshi News home page

మళ్లీ ట్రామ్ పరుగులు!

Published Wed, Mar 5 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

మళ్లీ ట్రామ్ పరుగులు!

మళ్లీ ట్రామ్ పరుగులు!

 2.5 కిలోమీటర్ల మేర ట్రామ్‌మార్గం నిర్మాణం
 ప్రతిపాదనకు సమ్మతించిన ఎల్జీ
 త్వరలోనే టెండర్లు
 
 న్యూఢిల్లీ: దేశరాజధాని చారిత్రక వైభవాన్ని ఇనుమడింపజేసిన ట్రామ్‌ల పునరుద్ధరణకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రామ్‌రైలు మార్గాల నిర్మాణ  ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. బ్రిటిష్ పాలన సమయంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ హర్డింగ్ హయాంలో 1908, మార్చి ఆరున ట్రామ్ సేవలు మొదలయ్యాయి. కాలక్రమేణా సాధారణ రైళ్ల సేవలు విస్తరించడం, వాహన సంచారం పెరగడంతో 1960 దశకంలో వీటికి గడ్డుకాలం దాపురించింది. పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా సుభాష్‌మార్గ్ నుంచి ఫతేపురి మసీదు వరకు 2.5 కిలోమీటర్ల మేర ట్రామ్ మార్గం నిర్మాణానికి ప్రభుత్వం సమ్మతించింది. ఇందులో భాగంగా రిక్షాలు, బగ్గీల వంటి మోటారు రహిత వాహనాల కోసం కూడా ప్రత్యేక లేన్లు నిర్మిస్తారు. అంతేగాక 50 శాతం మార్గాన్ని పాదచారుల మార్గాల నిర్మాణానికి కేటాయిస్తారు.
 
  ట్రామ్‌ల ఏర్పాటు ప్రతిపాదనకు గత వారం ఆమోదం లభించిందని, అయితే మసీదు ప్రాంతంలో మోటారు వాహనాల సంచారంపై ఆంక్షలు విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విశాలమైన పాదచారుల మార్గాల వెంట నిర్మించే ట్రామ్‌మార్గాన్ని ఎర్రకోటకు దారితీసే రోడ్డుతోనూ అనుసంధానిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ  బాధ్యతను ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు అప్పగించాలని భావిస్తున్నారు.  ట్రామ్ ప్రాజెక్టు డిజైన్‌ను ఎల్జీ చైర్మన్‌గా వ్యవహరించే యూనిఫైడ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్) సెంటర్ పరిశీలన కోసం వచ్చే వారం పంపిస్తారు.
 
 
  పెట్టుబడి ప్రతిపాదనల సమర్పణకు కూడా త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తారు. ట్రామ్‌ల ఏర్పాటుపై చర్చ కోసం గత వారం ఎల్జీ నేతృత్వంలో నిర్వహించిన భేటీకి ప్రజాపనుల విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, మోటారు రహిత వాహనాల యజమానులు హాజరయ్యారు. అత్యంత చౌకరవాణా వ్యవస్థ అయిన ట్రామ్‌ల హవా మనదేశంలో 1960 వరకు కొనసాగింది. అప్పట్లో జామా మసీదు, చాందినీచౌక్, సదర్‌బజార్ మీదుగా ట్రామ్‌లు నడిచేవని స్థానికులు చెబుతారు. వీటి తొలగింపునకు స్థలాభావమే ప్రధాన కారణమని రవాణారంగ నిపుణుడు ఒకరు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement