.కృష్ణా – రాయచూర్ రైలు సర్వీసును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ. పక్కన గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట–సికింద్రాబాద్ మార్గంలో రెండు ప్యాసింజర్ రైళ్లు మంగళవారం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటతో పాటు గజ్వేల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాచగిరి (నాచారం), కొమురవెల్లి తదితర ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. తొలుత కాచిగూడ–సిద్దిపేట మధ్య రైళ్లు తిప్పాలని భావించినా, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువ మంది సికింద్రాబాద్‌కు వస్తున్నందున, సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది.
సికింద్రాబాద్–సిద్దిపేట (నిడివి 116 కిలోమీటర్లు)
- డెమూ రైలుచార్జీ :రూ.60
- హాల్ట్‌స్టేషన్లు: మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట
ట్రిప్పులు ఇలా...
- సిద్దిపేటలో రైలు(నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్‌కు 10.15కు చేరుకుంటుంది.
- తిరిగి సికింద్రాబాద్‌లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది.
- తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.10 గంటలకు చేరుకుంటుంది.
- సికింద్రాబాద్‌లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు రాత్రి 8.40 గంటలకు చేరుకుంటుంది.
- అయితే ఉదయం సిద్దిపేట బదులు సికింద్రాబాద్ నుంచే రైలు బయలుదేరేలా చూడాలని స్థానిక నేతలు రైల్వేకు లేఖ రాశారు. దీనికి రైల్వే సమ్మతిస్తే ఈ వేళలు అటూ ఇటుగా మారుతాయి.
- సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్సుచార్జీ రూ.140. ప్రయాణ సమయం రెండున్నర గంటలు. రైలులో ప్రయాణ సమయం కాస్త ఎక్కువగా ఉన్నా, చార్జీ మాత్రం బస్సుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉంది. రైలులో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రానుపోను రూ.120 అవుతుండగా, పాస్ తీసుకుంటే రూ.90 ఉండొచ్చు.
కృష్ణా టు రాయచూర్ రైలు రాకపోకలు షురూ
మహబూబ్‌నగర్–మునీరాబాద్ (కర్ణాటక) మధ్య 234 కి.మీ. నిడివితో నిర్మించే రైల్వే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా వరకు పనులు పూర్తి కావటంతో కొత్త రైలు సర్విసు ప్రారంభమైంది. కాచిగూడ–బెంగుళూరు మార్గంలో ఉన్న దేవరకద్ర నుంచి కొత్తలైన్ మొదలు, అటు సికింద్రాబాద్–వాడీ మార్గంలో ఉన్న కర్నాటక సరిహద్దు స్టేషన్ అయిన కృష్ణాకు ఇది అనుసంధానమైంది. దీంతో కాచిగూడ నుంచి కృష్ణా స్టేషన్ మీదుగా కర్ణాటకలోని రాయచూరు వరకు ప్యాసింజర్ డెమూ రైలు సర్విసును ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్నగర్లో జరిగిన బహిరంగసభలో జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కృష్ణా నుంచి కొత్త రైలు బయలుదేరి కాచిగూడకు చేరుకుంది. సోమవారం నుంచి కాచిగూడ–రాయచూరు మధ్య ప్రారంభమవుతుంది.
రైలుచార్జీ: 85.. రోజుకు ఒకటే ట్రిప్పు
కాచిగూడ–రాయచూరు (నిడివి 221 కిలోమీటర్లు) ప్రస్తుతం స్పెషల్ సర్వీసుగా ఉన్నందున ఎక్స్‌ప్రెస్ చార్జీలున్నాయి. రెగ్యులర్ సర్విసుగా మారిన తర్వాత ఆర్డినరీ చార్జీలు అమలులోకి వస్తాయి. అప్పుడు చార్జీ రూ.50 ఉంటుంది.హాల్ట్‌స్టేషన్లు: కాచిగూడ, మలక్‌పేట, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, శివరాంపల్లి, బుద్వేల్, ఉందానగర్, తిమ్మాపూర్, కొత్తూరు, షాద్‌నగర్, బూర్గుల, బాలానగర్, రాజాపురా, గొల్లపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి, యెనుగొండ, మహబూబ్‌నగర్, మన్యంకొండ, దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా, చిక్‌సుగుర్, రాయచూరు
రైలు (నంబరు:07477) వేళలు ఇలా
- కాచిగూడలో ఉదయం 9.40కి బయలు దేరి 11.50గంటలకు మహబూబ్‌నగర్, 12.14కు దేవరకద్ర, మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా, 3 గం.కు రాయచూరు చేరుకుంటుంది.
- తిరిగి రాయచూరులో మధ్యాహ్నం.3.30 గంటలకు రైలు(నంబరు:07478)బయలుదేరి 3.49కి కృష్ణా, 5.29కి దేవరకద్ర, 6.05కు మహబూబ్‌నగర్ రాత్రి 9.10గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment