Train Services To Siddipet In August - Sakshi
Sakshi News home page

ఆగస్టులో సిద్దిపేటకు రైలు.. తిరుపతి, బెంగళూరు, ముంబయికి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు

Published Thu, Jun 22 2023 2:57 AM | Last Updated on Thu, Jun 22 2023 4:17 PM

Train services to Siddipet in August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆగస్టులో సిద్దిపేటకు రైలు సర్విసులు ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. మనోహరాబాద్‌–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా జూలై చివరి నాటికి లేదా ఆగస్టు మొదటి వారాంతానికి సిద్దిపేట వరకు రైల్వే లైన్‌ సిద్ధం కాబోతోంది.

ప్రస్తుతం సిద్దిపేట సమీపంలోని దుద్దెడ వరకు పూర్తిస్థాయి ట్రాక్‌ ఏర్పాటు పూర్తికాగా, అక్కడి నుంచి సిద్దిపేట చేరువ వరకు తాత్కాలిక ట్రాక్‌ ఏర్పాటు పూర్తయింది. సిద్దిపేట బైపాస్‌ వరకు ఆ పనులు పూర్తయిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన పట్టాలు ఏర్పాటు చేస్తారు. ఆ వెంటనే రైల్వే సేఫ్టీ కమిషనర్‌ దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ట్రాక్‌ సామర్థ్యాన్ని పరీక్షించి అనుమతి ఇవ్వగానే రైలు సేవలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  



పుష్‌పుల్‌.. ఎక్స్‌ప్రెస్‌లు.. 
గజ్వేల్‌ వరకు లైన్‌ నిర్మాణం పూర్తయిన వెంటనే గతేడాదే అక్కడి నుంచి నగరానికి ప్యాసింజర్‌ రైలు నడపాలని నిర్ణయించారు. కానీ కోవిడ్‌ ఆంక్షలతో ఇందుకు ఆటంకం ఎదురయ్యింది. తర్వాత ప్రారంభించాలని భావించినా, గజ్వేల్‌ నుంచి నిత్యం నగరానికి ఓ రైలుకు సరిపడా ప్రయాణికులు ఉండరన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో ఆ ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు.

ఇప్పుడు సిద్దిపేట నుంచి సరిపడ సంఖ్యలో ప్రయాణికులు ఉంటారని నిర్ధారించుకున్న అధికారులు.. రోజుకు ఒకటి లేదా రెండు పుష్‌పుల్‌ రైలు ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. సిద్దిపేట నుంచి కాచిగూడకు ఆ రైలు నడుస్తుందని చెబుతున్నారు.

ఇక తిరుపతికి, బెంగళూరుకు గాని ముంబయికి గాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా సిద్దిపేట నుంచి నడపాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమవుతున్న కొన్ని ఎక్స్‌ప్రెస్‌లను సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే, కరీంనగర్‌ ప్రయాణికులకు కూడా వెసులుబాటుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.  

సిద్దిపేట స్టేషన్‌ వద్ద ఐదు లైన్లు.. 
సిద్దిపేటలో రైల్వే స్టేషన్‌ భవనం వేగంగా సిద్ధమవుతోంది. దాంతోపాటు సరుకు రవాణాకు భారీ గూడ్సు యార్డును నిర్మిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఐదు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి మెయిన్‌ లైన్, రెండు లూప్‌లైన్లు, ఒకటి గూడ్సు లైను, ట్రాక్‌ మెయింటెనెన్స్‌కు వినియోగించే ట్రాక్‌ మిషన్‌ కోసం సైడింగ్‌ లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

ప్లాట్‌ఫామ్స్‌ 750 మీటర్ల పొడవుతో సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి సరుకు రవాణా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్న రైల్వే శాఖ, అందుకోసం దాదాపు 800 మీటర్ల పొడవుతో గూడ్సు షెడ్డును ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే గజ్వేల్‌లో 600 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన సరుకు రవాణా యార్డు బాగా ఉపయోగపడుతోంది.

ఈ ప్రాంతానికి కావాల్సిన ఎరువులు రైలు ద్వారానే వస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి ధాన్యం క్రమం తప్పకుండా ఎగుమతి అవుతోంది. సిద్దిపేటలో కూడా సరుకు రవాణా ప్రాంగణం అందుబాటులోకి వస్తే ధాన్యం తరలింపు ఊపందుకోనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement