2022 మార్చిలో... సిద్దిపేటకు రైలు కూత  | Train Services Between Gajwel-Siddipet To be Started by Next Year | Sakshi
Sakshi News home page

2022 మార్చిలో... సిద్దిపేటకు రైలు కూత 

Published Sat, Feb 6 2021 8:40 AM | Last Updated on Sat, Feb 6 2021 8:40 AM

Train Services Between Gajwel-Siddipet To be Started by Next Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రముఖ పట్టణంగా ఎదిగిన సిద్దిపేటకు వచ్చే సంవత్సరం మార్చి నాటికి రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాజధాని నగరంతో ఈ కీలక పట్టణం రైల్వే పరంగా అనుసంధానం కానుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉన్నప్పటికీ, ప్రధాన రైల్వే మార్గంలో లేకపోవటం సిద్దిపేటకు పెద్ద లోపం. ఇప్పుడు మనోహరాబాద్‌– కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పుణ్యాన ఆ లోపం తీరుపోనుంది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతుండటంతో వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్దిపేటకు రైలు సేవలు ప్రారంభించాలని తాజాగా రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టులో గజ్వేల్‌ వరకు పూర్తిస్థాయి పనులు పూర్తి కావటంతో ప్రయోగాత్మకంగా రైలు నడిపి లోపాలు లేవని నిర్ధారించుకున్నారు. దీనికి రైల్వే సేఫ్టీ కమిషనర్‌ కూడా అనుమతి ఇవ్వటంతో రెగ్యులర్‌ సర్వీసుల్లో భాగంగా సిబ్బందితో ఓ రైలు నడుపుతున్నారు.

లాక్‌డౌన్‌ నిబంధనల్లో మరిన్ని సడలింపులు ఇస్తూ సాధారణ రైలు సేవలను పెంచితే గజ్వేల్‌ వరకు నిత్యం ఓ సర్వీసు నడపాలని నిర్ణయించారు. త్వరలో అది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ సంవత్సరం జూన్‌ నాటికి కొడకండ్ల వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, అది కూడా సిద్ధమైతే గజ్వేల్‌ మీదుగా అక్కడి వరకు రైలు సేవలు పొడిగించాలని కూడా నిర్ణయించారు. ఇది గజ్వేల్‌ తర్వాత 11.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జూన్‌– జూలై నాటికల్లా పనులు పూర్తి చేసేలా కొత్త షెడ్యూల్‌ రూపొందించుకున్నారు. ఏవైనా అవాంతరాలు ఎదురై ఆలస్యం జరిగినా, సెప్టెంబరు నాటికన్నా రైలు అక్కడికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. 2023లో మరో 37.15 కి.మీ. పనులు పూర్తి చేసి సిరిసిల్ల వరకు ట్రాక్‌ సిద్ధం చేయాలని, 2024లో మిగతా 39 కి.మీ. పనులు పూర్తి చేసి చివరిస్టేషన్‌ కొత్తపల్లి వరకు పనులు చేయటం ద్వారా ప్రాజెక్టును ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా వెల్లడించారు.  

ఇప్పటికే వంతెనల పనులు పూర్తి 
మేడ్చల్‌ సమీపంలోని మనోహరాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈ కొత్త లైను ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 31 కి.మీ. దూరంలో ఉన్న గజ్వేల్‌ వరకు పూర్తి పనులు అయిపోయాయి. అక్కడి నుంచి దుద్దెడ మధ్య ఎర్త్‌వర్క్‌ చివరి దశలో ఉంది. మధ్యలో 52 చిన్న వంతెనల పనులు పూర్తయ్యాయి. పెద్ద వంతెనలు నాలుగుండగా... మూడు చివరి దశలో ఉన్నాయి. కుకునూరుపల్లి వద్ద రాజీవ్‌ రహదారి మీద నిర్మించాల్సిన పెద్ద వంతెన పనులు మరో నాలుగైదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కొడకండ్ల వద్ద కెనాల్‌ మీద నిర్మిస్తున్న వంతెన చివరి దశలో ఉంది. మరో వారం రోజుల్లో కొడకండ్ల వరకు రైలు ట్రాక్‌ పరిచే పని ప్రారంభం కానుంది. రిమ్మనగోడు– కొడకండ్ల మధ్యæ, కొడకండ్ల కెనాల్‌ క్రాసింగ్, వెలికట్ట, సిద్దిపేట కలెక్టరేట్‌ వద్ద, దుద్దెడ స్టేషన్‌ సమీపంలో పెద్ద వంతెనల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈమార్గానికి ఇంకా విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరు కాలేదు. దీంతో ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి డీజిల్‌ ఇంజిన్‌ రైళ్లు నడవనున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement