ఢిల్లీలో బీజేపీ సర్కారు?
హస్తినలోనూ జెండా ఎగరేసేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి అవకాశం లభించేలా ఉంది. ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసినప్పటినుంచి ఢిల్లీ రాష్ట్రపతి పాలనలోనే ఉంది. అత్యధిక స్థానాలు పొందిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి ఓ నివేదిక పంపారు.
కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించేముందు సభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం బీజేపీకి ఇవ్వడం మంచిదని ఆయన పేర్కొన్నారు. అయితే.. బీజేపీని ఆహ్వానించడం రాజ్యాంగవిరుద్ధమని, దీనివల్ల పార్టీలు మారేవాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ అభ్యంతరం చెబుతున్నారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 29 మంది సభ్యులున్న బీజేపీ ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 మంది ఉన్నారు. వాస్తవానికి బీజేపీ తరఫున 31 మంది గెలిచినా, ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ సహా ముగ్గురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. దాంతో ఇప్పుడు సభలో మెజారిటీ కావాలంటే బీజేపీకి మరో ఐదుగురి మద్దతు అవసరం. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమా లేదా అని బీజేపీ కూడా మల్లగుల్లాలు పడుతోంది.