నాడు యోగి చేతిలో ఓడి.. నేడు సీఎంకు షాక్
- కేజ్రీవాల్‌ను కంగుతినిపించిన భోజ్‌పూరి స్టార్!
న్యూఢిల్లీ: ఇది 2009 లోక్‌సభ ఎన్నికలనాటి ముచ్చట. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థిగా మనోజ్ తివారీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎస్పీ ఆయనకు గోరఖ్‌పూర్ టికెట్ ఇచ్చింది. గోరఖ్‌పూర్ స్థానంలో 1998 నుంచి యోగి ఆదిత్యనాథ్ గెలుస్తూ వచ్చారు. 2009లోనూ సీన్ మారలేదు. తివారీకి నిరాశే ఎదురైంది.
కట్ చేస్తే 2017.. బుధవారం వెలువడిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడోసారి బీజేపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ప్రధానంగా వెలుగులోకి వచ్చింది మాత్రం మనోజ్ తివారీయే. పాపులర్ భోజ్‌పూరి స్టార్ హీరో అయిన ఆయన ఢిల్లీ బీజేపీ చీఫ్‌గా తాజా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు క్రెడిట్ ప్రధాని మోదీదేనని తివారీతో సహ పార్టీ నేతలంతా ముక్తకంఠంతో చెప్తున్నా.. కమలం శ్రేణులను సమన్వయంతో ముందుండి నడిపించి.. ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన తివారీ పాత్ర తోసిపుచ్చలేనిది.
తివారీ రాజకీయ జీవితం ఇటీవలే మేలిమలుపు తిరిగిందని చెప్పవచ్చు. కేవలం ఆరు నెలల కిందటే ఆయనకు ఢిల్లీ బీజేపీ చీఫ్ పగ్గాలను అందజేశారు. పదేళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రజావ్యతిరేకతను దూరం చేసి.. పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్‌కు చెందిన ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. భోజ్‌పూరి స్టార్‌గా వారిలో తివారీకి ఉన్న క్రేజ్ కలిసివస్తుందని బీజేపీ భావించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అకవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం వెనుక కూడా పూర్వాంచల్ ఓటర్లే ఉన్నారు. ఈ వ్యూహం బాగానే కలిసివచ్చింది. ఈశాన్య ఢిల్లీ ఎంపీగా ఉన్న తివారీ తనకప్పగించిన బాధ్యతల్లో వెంటనే ఇమిడిపోయి నగరంలోని మురికివాడలు, నిరుపేద, మధ్యతరగతి నివాసాల్లో ఎక్కువగా తిరిగారు. రాత్రుళ్లు బస చేసి.. ఓటర్లతో మమేకమయ్యారు. ఢిల్లీలోని 270 వార్డులకుగాను 250 వార్డులలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. హిందీ, భోజ్‌పూరి భాషలో పట్టు ఉండటంతో ఆయన సులువుగా ఓటర్లతో కలిసిపోయి వారిని ఆకట్టుకోగలిగారని, ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చిందని పరిశీలకులు చెప్తున్నారు.