గిరీశ్ చంద్ర ముర్ము ప్రమాణం
శ్రీనగర్: కేంద్ర పాలిత జమ్మూ కశ్మీర్ కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్‌జీ)గా ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము, లదాఖ్ ఎల్‌జీగా ఆర్‌కే మాథూర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణం చేయించారు. లేహ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్‌కే మాథూర్ ప్రమాణం చేశారు. శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన గిరీశ్ చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారానికి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు.
జమ్మూ నియోజకవర్గ లోక్‌సభ ఎంపీ జుగల్ కిశోర్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)కి చెందిన రాజ్యసభ సభ్యుడు నజీర్ అహ్మద్ లావే మాత్రమే హాజరుకావడం గమనార్హం. నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ)కి చెందిన ఎంపీలు, పీడీపీ రాజ్యసభ సభ్యుడు మరొకరు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. శ్రీనగర్ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధంలో ఉండటంతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేకపోయారు.
ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌లోని తన అధికార నివాసంలో ఆహ్వాన పత్రికను విసిరేసి వెళ్లారని పీడీపీ రాజ్యసభ ఎంపీ ఫయాజ్ మిర్ తెలిపారు. అయితే తాను కశ్మీర్‌లో లేనని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం తరపున తనకు అందించిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు బారాముల్లా ఎంపీ అక్బర్ లోనె వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వెళితే రాష్ట్ర విభజనను ఆమోదించినట్టు అవుతుందన్న ఉద్దేశంతో గైర్హాజరైనట్టు తెలిపారు. (చదవండి: నవ కశ్మీరం ఎలా ఉండబోతోంది?)
Comments
Please login to add a commentAdd a comment