RK Mathur
-
కశ్మీర్‌కు ముర్ము.. లదాఖ్‌కు మాథుర్
శ్రీనగర్/లెహ్: జమ్మూకశ్మీర్ రాష్ట్రం స్థానంలో నూతనంగా అవతరించిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా జీసీ ముర్ము, లేహ్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఆర్కే మాథుర్ గురువారం పాలనాపగ్గాలు చేపట్టారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దుతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్టు 5వ తేదీన కేంద్ర తీసుకున్న నిర్ణయం అక్టోబర్ 31వ తేదీ నుంచి అమల్లోకి రావడం తెల్సిందే. లదాఖ్ రాజధాని లెహ్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆర్కే మాథుర్‌తో జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జస్టిస్ గీతా మిట్టల్ శ్రీనగర్ వెళ్లారు. అక్కడ రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో జీసీ ముర్ము(59)తో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధాకృష్ణ మాథుర్(66) 1977 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన రక్షణ శాఖ కార్యదర్శిగా, సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌గా పనిచేసి రిటైరయ్యారు. గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ముర్ము స్వస్థలం ఒడిశా. విధుల్లో ఉండగానే లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి అధికారి ముర్మునే. కాగా, జమ్మూకశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం కేంద్ర విధించిన ఆంక్షలు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. -
ఇద్దరు మాత్రమే వచ్చారు!
శ్రీనగర్: కేంద్ర పాలిత జమ్మూ కశ్మీర్ కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ)గా ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము, లదాఖ్ ఎల్జీగా ఆర్కే మాథూర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణం చేయించారు. లేహ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్కే మాథూర్ ప్రమాణం చేశారు. శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన గిరీశ్ చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారానికి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. జమ్మూ నియోజకవర్గ లోక్‌సభ ఎంపీ జుగల్ కిశోర్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)కి చెందిన రాజ్యసభ సభ్యుడు నజీర్ అహ్మద్ లావే మాత్రమే హాజరుకావడం గమనార్హం. నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ)కి చెందిన ఎంపీలు, పీడీపీ రాజ్యసభ సభ్యుడు మరొకరు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. శ్రీనగర్ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధంలో ఉండటంతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేకపోయారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌లోని తన అధికార నివాసంలో ఆహ్వాన పత్రికను విసిరేసి వెళ్లారని పీడీపీ రాజ్యసభ ఎంపీ ఫయాజ్ మిర్ తెలిపారు. అయితే తాను కశ్మీర్లో లేనని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం తరపున తనకు అందించిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు బారాముల్లా ఎంపీ అక్బర్ లోనె వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వెళితే రాష్ట్ర విభజనను ఆమోదించినట్టు అవుతుందన్న ఉద్దేశంతో గైర్హాజరైనట్టు తెలిపారు. (చదవండి: నవ కశ్మీరం ఎలా ఉండబోతోంది?) -
కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ముర్ము
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము శుక్రవారం జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ముర్ము సీఎం అడిషనల్ ప్రిన్స్‌పల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో సెక్రటరీగా ఉన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్ట్ 5న కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నవంబర్ 1వ తేదీ నుంచి జమ్మూకశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పరిపాలన కొనసాగిస్తుంది.1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముర్ము ఈ నవంబర్ 30 న పదవీ విరమణ చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఈ నెల 31న శ్రీనగర్‌లో ముర్ము ప్రమాణ స్వీకారంచేస్తారు. కశ్మీర్, జమ్మూ ప్రాంతాల పరిపాలనాధికారిగా ఆయన వ్యవహరిస్తారు. మరోవైపు, లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్కే మాథుర్ నియమితులయ్యారు.మాథుర్ 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గత సంవత్సరం ప్రధాన సమాచార కమిషనర్‌గా రిటైర్ అయ్యారు. లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆయన అక్టోబర్ 31న లేహ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. జమ్మూకశ్మీర్ ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్ గోవా గవర్నర్‌గా వెళ్తున్నారు. తన మిగతా పదవీకాలాన్ని ఆయన గోవాలో పూర్తి చేస్తారు. ముర్ము లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్‌కు సలహాదారులుగా వ్యవహరిస్తున్న కే విజయకుమార్, ఖుర్షీద్ గనాయి, కే సికందన్, కేకే శర్మల పదవీకాలం కూడా ముగుస్తుంది. మరోవైపు, మాజీ ఐబీ చీఫ్ దినేశ్వర్ శర్మను లక్షద్వీప్ పరిపాలనాధికారిగా నియమిస్తూ కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మిజోరం గవర్నర్‌గా బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైను నియమించారు. -
బోస్ బతికున్నారో లేదో చెప్పండి: సీఐసీ
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారా? చనిపోయారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిందిగా జాతీయ అర్కైవ్స్ విభాగాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. బోస్పై అవధేశ్ కుమార్ చతుర్వేది అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థించారు. 2015, 16ల్లో బోస్ జయంతి రోజున ప్రధాని ఎందుకు నివాళి అర్పించారో చెప్పాలన్నారు. సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో సీఐసీని ఆశ్రయించారు. సంబంధిత రికార్డులన్నీ జాతీయ అర్కైవ్స్ విభాగం వద్ద ఉన్నాయని పీఎంవో చెప్పడంతో 15 రోజుల్లోగా దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ప్రధాన సమాచార కమిషనర్ ఆర్కే మాథుర్ అర్కైవ్స్ విభాగాన్ని ఆదేశించారు. -
4న కొత్త సీఐసీగా మాథుర్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార శాఖ (సీఐసీ) కొత్త కమిషనర్‌గా ఆర్కే మాథుర్ జనవరి 4న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల ద్వారా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరగనుంది. మాధుర్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ డిసెంబర్ 16న మాథుర్‌ను సీఐసీ చీఫ్‌గా ఎంపిక చేసింది. అంతకుముందున్న కమిషనర్ విజయ్ శర్మ పదవీ కాలం డిసెంబర్ 1న పూర్తయ్యింది. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. -
సీఐసీగా ఆర్కే మాథుర్ నియామకం
న్యూఢిల్లీ: మాజీ రక్షణ శాఖ కమిషనర్ ఆర్కే మాథుర్ ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా నియమితులయ్యారు. ప్రస్తుతం కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ శర్మ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో మాథుర్‌ను కేంద్రం నియమించింది. మాథూర్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. త్రిపుర కేడర్‌కు చెందిన 62 ఏళ్ల మాథూర్ 2013 మే 28 నుంచి రెండేళ్ల పాటు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. -
విక్రాంత్ నుఅమరుల స్మారక చిహ్నంగా మార్చండి
న్యూఢిల్లీ : కాలం చెల్లిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను అమరుల స్మారక చిహ్నంగా మార్చాలని మహారాష్ట్ర నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ, శివసేన ఎంపీల బృందం కేంద్రాన్ని కోరింది. ‘విక్రాంత్ ను కాపాడండి, దానిని యుద్ధ మ్యూజియం ‘అమరుల స్మారకం’గా మార్చండి. తుక్కుగా చేయాలన్న ప్రతిపాదనను ఆపేయండి. దారుఖానా చెత్త కేంద్రానికి తరలింపును నిలిపివేయండి. అమరుల స్మారక చిహ్నంగా మార్చే ప్రతిపాదనను మరోసారి పరిగణనలోకి తీసుకోండి’ అని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.కె.మాథుర్‌కు 18 మంది ఎంపీలు లేఖ రాశారు. 1997లో ఓడ సామర్థ్యం తగ్గిపోవడంతో దాని భవితవ్యం డోలాయమానంలో పడింది. ఒకప్పుడు దేశానికి ఎంతో గర్వ కారణమైన ఈ పాత ఓడను ముంబై నావికా డాక్ యార్డ్ నుంచి దారుఖానాలోని షిప్ బ్రేకింగ్ యార్డ్‌కు తరలించాలని మే 16న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. విక్రాంత్ యుద్ధ నౌక చాలా పురాతనమైపోయిందని, బాగా దెబ్బతిని శక్తి విహీనమైపోయిందని, దాన్ని మరమ్మతులు చేయడం సాధ్యంకాదని ప్రభుత్వం తెలిపిన తరువాత కోర్టు ఈ తీర్పు వెలువరించింది. దారుఖానా షిప్ బ్రేకింగ్ యార్డ్‌కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త కిరణ్ పైగాంకర్ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లారు. విక్రాంత్‌ను మ్యూజియంగా మార్చాలని ఆయన తన పిటిషన్లో అభ్యర్థించారు. అతని అభ్యర్థనపై స్పందించిన కోర్టు, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. యధాస్థితిని కొనసాగించాలని మే 5న చెప్పింది. అయితే దాన్ని తుక్కుగా చేయబోమని, భద్రత రీత్యా ఐఎన్ఎస్ విక్రాంత్‌ను వేరే ప్రాంతానికి మాత్రమే తరలిస్తామని ప్రభుత్వం చెప్పడంతో కోర్టు అందుకు అనుమతించింది. అయితే నిధుల కొరత వల్ల తాము మ్యూజియంను నిర్వహించలేమని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే వేలం వేసింది. 63 కోట్ల రూపాయలతో ఐబీ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ విక్రాంత్‌ను దక్కించుకుంది.