
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు లెప్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేశారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల నేతలతో జరిపిన చర్చలపై తన నివేదికతో పాటు, అసెంబ్లీని రద్దు చేయవలసిందిగా కోరుతూ సిఫార్సులను ఆయన ఈరోజు ఉదయం రాష్ట్రపతికి సమర్పించారు.
కాగా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై తమకు ఆసక్తిలేదని, ఎనిమిది నెలల రాజకీయ అనిశ్చిత పరిస్థితికి అంతం పలుకుతూ తాజాగా ఎన్నికలు నిర్వహించాలని శాసనసభలో అత్యధిక స్థానాలున్న అతిపెద్ద పార్టీ బీజేపీతోపాటు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ స్పష్టం చేశాయి. దీంతో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు అనివార్యం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.