అసెంబ్లీ రద్దుపై ఆప్ పిటిషన్
రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగింత
సాక్షి, న్యూఢిల్లీ : లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ అసెంబ్లీని వెంటనే రద్దు చేసి తక్షణం ఎన్నికలు జరిపించవలసింది గా ఆదేశించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిం చింది. రాష్ట్రపతి పాలనను సవాలుచేస్తూ ఆప్ దాఖలుచేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వం లోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ అసెంబ్లీ రద్దుపై లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా రాష్ట్రపతి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటారు కాబట్టి దీనిపై తాము మార్గదర్శకాలను జారీ చేయడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆప్ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి అసెంబ్లీని తక్షణం రద్దు చేసిన మరుసటి రోజునే ఈ కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ 49 రోజులకే వైదొలిగారు. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడానికి నిరసనగా ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రజాస్వామిక ప్రభుత్వం అందుబాటులో ఉండడం లేదని పేర్కొంటూ ఆప్‌సుప్రీంకోర్టును ఆశ్రయించింది.