'మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి'
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. బయట నుంచి ఎవరైనా మద్దతిస్తే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. అసెంబ్లీని రద్దు చేయాలన్న ఆప్ పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రయత్నాలను న్యాయస్థానం సమర్థించింది. తదుపరి విచారణను నవంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.
కాగా గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ 49 రోజులకే వైదొలిగారు. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడానికి నిరసనగా ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రజాస్వామిక ప్రభుత్వం అందుబాటులో ఉండడం లేదని పేర్కొంటూ ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.