
న్యూఢిల్లీ: దేశంలోని మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో నేడు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదే తరుణంలో ఢిల్లీలోనూ అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. 2025 ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీతో సహా వివిధ పార్టీలు ఇప్పటికే తమ సన్నాహాలు మొదలుపెట్టాయి.
తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని నేతల పనితీరు, విజయావకాశాలను పరిగణలోకి తీసుకుని వారికి టిక్కెట్లు కేటాయించనున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు అనే భావనతో ఎవరికీ టిక్కెట్లు కేటాయించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. తమ పార్టీ సత్య మార్గాన్ని అనుసరించిందని, పార్టీకి దేవునితో పాటు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్‌లో యూపీ ఓటర్లు ఎటువైపు?