సర్కారు ఏర్పాటుకు ఆప్ సిద్ధం
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ను ఆయన సోమవారం కలవనున్నారు. కాంగ్రెస్ మద్దతుతో తాను ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆదివారమే ప్రకటించిన కేజ్రీవాల్ ఇందుకు కావల్సిన ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.
70 మంది సభ్యులుండే ఈ అసెంబ్లీలో బీజేపీకి 31 స్థానాలు రాగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 28 స్థానాలు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల గెలిచింది. కొన్ని షరతులకు లోబడి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. దీంతో ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలా వద్దే అనే విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాభిప్రాయాన్ని కోరింది. ప్రజలు తమను అధికారంలో చూడాలనే భావిస్తున్నారని, అందువల్ల తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. అయతే, కాంగ్రెస్-ఆప్ పొత్తు అపవిత్రం, అనైతికమని కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.