కిరణ్‌కు అభయం
కిరణ్‌కు అభయం
Published Mon, Jun 26 2017 8:26 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM
►కేంద్రం అధికారాలు సీఎంకు హోం శాఖ వివరణ
►ఇక, సంకటంలో నారాయణ సర్కారు
చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి కేంద్రం అభయం ఇచ్చింది. సీఎం నారాయణ స్వామి సర్కారును సంకటంలోకి నెట్టే రీతిలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సీఎం నారాయణ స్వామి ఇచ్చిన ఫిర్యాదుకు కేంద్ర హోం శాఖ ఇచ్చిన వివరణ మున్ముందు పుదుచ్చేరిలో ఎలాంటి వివాదాలకు ఆజ్యం పోస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందుకు అస్త్రంగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి పైగా అవుతున్నా, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణ స్వామి మధ్య నిత్యం సమరమే. వీరిద్దరి మధ్య చాప కింద నీరులా సాగుతున్న వివాదం చివరకు ముదిరి పాకాన పడింది.
ప్రభుత్వానికి అండగా అన్నాడీఎంకే, డీఎంకే అండగా నిలవడంతో కిరణ్‌ను రీకాల్ చేయడానికి తగ్గ ప్రయత్నాలు సాగాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం, తమకు కల్పించిన హక్కులను కాలరాసే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణలతో కిరణ్‌ను బర్తరఫ్ చేయాలని లేదా, వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదులు చేరాయి. అయితే, ఈ ఫిర్యాదుల్ని పరిశీలించిన కేంద్ర హోం శాఖ కిరణ్‌కు మరింత అభయాన్ని ఇస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలను వివరిస్తూ సీఎం నారాయణ స్వామికి సవవిరంగా లేఖాస్త్రాన్ని సంధించడం గమనార్హం.
నారాయణ ప్రభుత్వానికి సంకట పరిస్థితులు
రాష్ట్రాల గవర్నర్ల కన్నా, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ అందులో వివరించారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి వర్గంతో సంబంధం లేకుండా, ముందుకు సాగే అవకాశం ఉందని, అవసరం అయితే, అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సైతం వీలుందని వివరించడం గమనార్హం. అలాగే, మంత్రివర్గం నుంచి వచ్చే ఫైల్స్‌లో ఏదేని అనుమానాలు ఉన్నా, అధికారుల్ని పిలిపించి సమీక్షించడం, అవసరం అయితే, సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు సైతం అధికారం ఉన్నట్టు అందులో పేర్కొనడం బట్టి చూస్తే, మున్ముందు నారాయణ సర్కారుకు కిరణ్‌రూపంలో మరిన్ని సంకట పరిస్థితులు తప్పవని స్పష్టం అవుతోంది.
అలాగే విభేదాలు తలెత్తినా, అభిప్రాయభేదాలు ఎదురైనా, సమస్యలు తాండవించినా.. కీలక నిర్ణయం తీసుకునేందుకు తగ్గ సిఫార్సును రాష్ట్రపతికి చేసే అధికారం కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్నట్టు అందులో హెచ్చరించి ఉండడం గమనార్హం. అయితే, వీటన్నింటి గురించి పట్టించుకోకుండా, పుదుచ్చేరి ప్రగతి తనకు లక్ష్యం అని నారాయణ ముందుకు సాగుతున్నారు. ఆగస్టులో పుదుచ్చేరి హార్బర్ నుంచి సరకుల రవాణా విస్తృతం, సెప్టెంబరులో పుదుచ్చేరి విమానాశ్రయం నుంచి విమాన సేవలు సాగేందుకు తగ్గ ఏర్పాట్లలో మునిగారు.
Advertisement
Advertisement