
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (ఇన్‌చార్జ్) తమిళిసై సౌందరరాజన్ ప్రజలతో మమేకం అయ్యేరీతిలో, వారి సమస్యలు తెలుసుకునేందుకు మంగళవారం బస్సులో ప్రయాణం చేశారు. ప్రజల విజ్ఞప్తుల్ని విన్న ఆమె అవసరం అయితే, రాజ్‌నివాస్‌కు వచ్చి తనను కలవాలని సూచించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక వ్యవహారాలే కాదు, ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. తనకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె మంగళవారం బస్సులో పయనించారు. పుదుచ్చేరిలోని కడలూరు బస్టాండ్‌కు ఉదయం పది గంటలకు రాజ్‌నివాస్ నుంచి కారులో సహాయకుడు చంద్రమౌళితో కలిసి బయలుదేరారు.
అంతోనియార్ బస్టాండ్ వద్ద కారు నుంచి దిగేసి బర్గూర్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఎక్కారు. ముందు సీటులో కూర్చున్న ఆమె ప్రయాణికులతో మాటలు కలిపారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకోగా, మరి కొందరు పింఛన్ రాలేదంటూ, ఇంకొందరు రోడ్లు, తాగునీటి సౌకర్యం లేవంటూ ఇలా అనేక సమస్యల్ని ఆమె దృష్టికి తెచ్చారు. తవలకుప్పం వరకు ఆమె బస్సులో ప్రయాణించారు. ఆ తర్వాత కారులో అక్కడి డంపింగ్ యార్డ్‌కు వెళ్లారు. ఆ పరిసర వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిశీలించారు.
మళ్లీ తవలకుప్పం చేరుకుని మరలా మరో బస్సులో ప్రయాణించారు. అప్పటికే ఆ బస్సులో సీట్లు పూర్తిగా నిండి ఉన్నాయి. దీంతో ఆమె నిలబడే పయనం చేశారు. మాస్క్‌ను ఆమె ధరించి ఉండడంతో తొలుత ఎవరూ గుర్తు పట్టలేదు. చివరకు తమతో లెఫ్టినెంట్ గవర్నర్ పయనిస్తున్నట్టు గుర్తించిన అనేక మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే పనిలో పడ్డారు. కొందరు తన దృష్టికి పలుసమస్యలు తీసుకు రాగా, వారిని నేరుగా రాజ్‌నివాస్‌కు వచ్చి కలవాలని, తనను కలిసేందుకు ఎవరైనా రావచ్చు అని ప్రజలకు సూచించారు. కొన్ని గంటల పాటు బస్సులో పయనించి, ప్రజా సమస్యలు తెలుసుకున్న తమిళిసై మీడియాతో మాట్లా డారు. ప్రజా సమస్యల్ని తెలుసుకునే పరిష్కరించేందుకే ఈ పయనం అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment