పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బేడీ
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడీ గతంలో ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేశారు. రిటైరైన తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘోరంగా ఓడారు.
కృష్ణానగర్ నుంచి పోటీచేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బీజే పీ ప్రభుత్వం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఎల్జీగా నియమితులైన బేడీకి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. తాజాగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లకు గాను కాంగ్రెస్ డీఎంకే కూటమి 17 సీట్లను గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.