Former IPS Officer
-
పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్
హసన్‌పర్తి : ఓ రిటైర్డ్ పోలీసు అధికారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పోలీసు అధికారులకు ఇక్కడి ప్రజలు ఆదరించలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీపీగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన నాగరాజు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సీనియర్లు ఉన్నప్పటికీ టికెట్ దక్కించుకుని వర్ధన్నపేట నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై విజయం సాధించారు. ప్రచారంలో కూడా వెనుకే.. నాగరాజు ఎన్నికల ప్రచారం అంతంతమ్రాతమే చేశారు. ఆయన గెలుపునకు నాయకులు, కార్యకర్తలే కష్టపడ్డారు. నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాల్లో ఓటర్ల వద్దకు వెళ్లి ఈసారి తమకు ఓటు వేయాలని అభ్యర్థించా రు. ప్రభుత్వంపై వ్యతిరేకత నాగరాజు గెలు పునకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. -
నేరస్తుల పాలిట సింహస్వప్నం.. ఏఏ ఖాన్ కన్నుమూత
ముంబై: ముప్పై ఏళ్ల క్రితం ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) వ్యవస్థాపక సభ్యుడిగా, ముంబైలో కరుడుగట్టిన నేరస్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ (81) కోవిడ్ బారిన పడి అనంతరం తలెత్తిన అనారోగ్య కారణాలతో శుక్రవారం కన్నుమూశారు. ఈయనకు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవలే కోవిడ్ బారిన పడిన ఖాన్ అంధేరీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొద్దిరోజులకే అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో శుక్రవారం ఆస్పత్రికి తీసుకెళ్లగా అడ్మిట్ కావడానికి ముందే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చదవండి: (Maharashtra Survey: పిల్లల్ని బడికి పంపించేది లేదు!) గ్యాంగ్ స్టర్లకు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఎన్నో ఆపరేషన్లలో నిర్వహించారు. ఈయన 1963 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. 1995లో మహరాష్ట్ర ఐజీగా సేవలందించిన ఆయన అదే ఏడాది పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1990లో దేశంలో ఉగ్రవాదులకు, గ్యాంగ్స్టర్లకు వ్యతిరేకంగా తొలిసారిగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఇందుకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నేరస్తుల ఆటకట్టించేందుకు ప్రత్యేకంగా ఏర్పడిన స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) స్ఫూర్తితో దేశంలో ఏటీఎస్‌ను ఏర్పాటు చేశారు. ‘‘ఖాన్ తన దళాన్ని ఎప్పుడూ ముందుండి నడిపించేవారు. చాలా ధైర్యశాలి’’అని ఆయనతో పాటు పనిచేసిన రిటైర్డ్ ఏసీపీ ఇక్బాల్ షేక్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. చదవండి: (పంజాబ్ ఎన్నికల్లో అందరిదీ సేఫ్ గేమే!..) ‘‘1991 జనవరి 21న గుజరాత్‌లోని వడోదరాలో జరిగిన ‘‘ఆపరేషన్ బరోడా’’కు ఆయన నేతృత్వం వహించి అప్పటి ఖలిస్తాన్ కమాండ్ లీడర్ బాల్ డియో సింగ్ సైనీ తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. 1992లో ములుంద్ ఉపనగరంలోని ఖిందీపాదాలో ఐదుగురు ఉగ్రవాదులను కాల్చిచంపారు. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానం పేల్చివేత ఘటనకు బాధ్యుడు, నాటి హరియాణ ముఖ్యమంత్రి భజన లాల్‌పై కాల్పులకు తెగబడిన ఉగ్రవాది మన్జిత్ సింగ్ అలియాస్ లాసింగ్ 1992లో ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ నుంచి వస్తుండగా ఖాన్ బృందం అరెస్టు చేసింది. ఇంకా ముంబైలో కరుడుగట్టిన నేరస్తులు మాయా డోలాస్, దిలీప్ బువాలను లోఖండ్ వాలా కాంప్లెక్స్‌లోని స్వాతి భవనంలో ఖాన్ కాల్చి చంపారు’’అని ఇక్బాల్ షేక్ గుర్తు చేశారు. -
మాజీ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్ అరెస్ట్
లక్నో: 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నానంటూ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ అరెస్టయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై ఆయన్ను ఆరెస్టు చేసినట్లు పోలీసుల ప్రకటించారు. ఈ నెల 16న ఓ యువతి (24) ఆమె స్నేహితుడు కలసి సుప్రీంకోర్టు ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. తనపై బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అతుల్‌రాయ్ అత్యాచారం చేయగా, ఆయనకు సాయం చేసేలా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె ఆరోపించారు. అనంతరం కాలిన గాయాలతో ఆ యువతి ఈ నెల 24న కన్నుమూశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందం (సిట్)ఏర్పాటైంది. ఈ బృందం విచారణ జరిపి అనంతరం ఆ రిపోర్టును శుక్రవారం సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ఠాకూర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి వ్యతిరేకంగా, నిందితుడు అతుల్‌రాయ్‌కు మద్దతుగా ఆయన వ్యవహరించారని అభియోగాలు మోపి, మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు ఇలా పని చేస్తున్నారని విమర్శించారు. -
మరోసారి సీబీఐ
తణుకు: ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (వెస్ట్ మీరట్)గా పనిచేసిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాద్‌రావు వ్యవహారంలో సీబీఐ మరోసారి సోదాలు చేపట్టింది. ఈ వ్యవహారంలో వారం రోజులుగా తణుకు పరిసర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన బినామీలు, ఆస్తులు విక్రయించిన వారిపై దృష్టి సారించి వారిని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తణుకుకు చెందిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాదరావు ఇంటిలో గతేడాది అక్టోబరులో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయనతోపాటు ఆయన భార్య ఆకుల కనకదుర్గపైనా కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ ఏడాది మార్చిలో తణుకుకు చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు బినామీలు, ఆస్తులు విక్రయించిన వారికి నోటీసులు జారీ చేసి వారినీ విశాఖలోని సీబీఐ కార్యాలయంలో విచారించారు. చాలాకాలం తర్వాత మరోసారి సీబీఐ అధికారులు ఇటుగా దృష్టి సా రించారు. తాజాగా రాంప్రసాదరావు నివాసముంటున్న రెండు ఇళ్లతోపాటు బినామీలుగా వ్యవహరించిన పలువురి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమాస్తుల వ్యవహారంలో ఆస్తులు విక్రయించిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన, బినామీలుగా ఉన్న వ్య క్తులకు సైతం ఇటీవల నోటీసులు జారీ చేసిన అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. వారం రోజులుగా చేస్తున్న సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. గతేడాది కేసు నమోదు కేంద్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎ ఫ్ఎస్ అధికారిగా ముత్యాల రాంప్రసాదరావు పనిచేస్తున్న సమయంలోనే సీబీఐ అధికారులు తణుకులోని ఆయన నివా సంపై దాడి చేసి గతేడాది అక్టోబర్ 11న కేసు నమోదు చేశారు. ఆయన గతంలో ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తణుకు, విశాఖ, న్యూఢిల్లీ, మీరట్‌లో ఏ కకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.10.72 కోట్ల విలువైన చర, స్థిరాస్తి డాక్యుమెంట్లతోపాటు రూ. 37.25 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. రాంప్రసాదరావు భార్య ఆకుల కనకదుర్గ తణుకు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన సమాచారంతో రాంప్రసాదరావు, కనకదుర్గపై అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ప్రధాని పేషీకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దాడులు చేశారు. కనకదుర్గ భారీస్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెకు బినామీలుగా ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారులపైనా దృష్టి సారిం చిన అధికారులు మరోసారి సోదాలు ని ర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మా రింది. అధికారులు రాజమండ్రి సీబీఐ కార్యాలయంలో వీరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తణుకు రాష్ట్రపతి రోడ్డులో రాంప్రసాదరావు నివాసముంటున్న అ పార్ట్మెంట్లోని అన్ని ఫ్లాట్లలో సోదాలు జరిపినట్టు తెలిసింది. -
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బేడీ
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడీ గతంలో ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేశారు. రిటైరైన తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘోరంగా ఓడారు. కృష్ణానగర్ నుంచి పోటీచేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బీజే పీ ప్రభుత్వం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఎల్జీగా నియమితులైన బేడీకి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. తాజాగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లకు గాను కాంగ్రెస్ డీఎంకే కూటమి 17 సీట్లను గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. -
ఆరువైపుల నుంచి అండాదండ
బేడీ పి - 6 మహిళల భద్రత, రక్షణల కోసం ప్రభుత్వాలు ఎంత కిందామీదా అవుతున్నా కూడా ఆశించిన ఫలితాలను పూర్తిగా సాధించలేకపోతున్నాయన్నది నిజం. మహిళలను కంటికి రెప్పలా కాపుగాయడానికి ఎప్పటికప్పుడు ఎన్ని చట్టాలు పుట్టుకొస్తున్నా, వాటిని ఉల్లంఘించేవారి సంఖ్య కూడా అందుకు సమానంగా పెరిగిపోతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను, అఘాయిత్యాలను నివారించడం, నిరోధించడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానంగా మాజీ ఐ.పి.ఎస్. అధికారి, సామాజిక కార్యకర్త కిరణ్ బేడి ‘సాధ్యమే’ అని అంటున్నారు. ఊరికే అనడం కాదు, అందుకు ఓ ఆరు సూత్రాలను కూడా సూచించారు. వాటికి ఆమె ‘6 పి కాన్సెస్ట్’ అని పేరుపెట్టారు. ఈ ఆరుసూత్రాలను కనుక పాటించగలిగితే మహిళలకు అన్ని వైపుల నుంచి భద్రతను, రక్షణను కల్పించడం సాధ్యమౌతుందని ఐక్యరాజ్యసమితి 70వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె చెప్పారు. ‘6 పి కాన్సెప్టు’లో మొదటి పి - ‘పేరెంట్స్. పిల్లల పెంపకంలో (ముఖ్యంగా అబ్బాయిల పెంపకంలో) కనుక తల్లిదండ్రులు జాగ్రత్త వహించినట్లయితే భవిష్యత్తులో స్త్రీలపై జరిగే హింసను నివారించగలమని బేడీ అభిప్రాయపడ్డారు. ఆడ, మగ అన్న వ్యత్యాసం లేకుండా ఇద్దరికీ సమాన అవకాశాలను కల్పించడం, ఒకరిపై ఒకరికి పరస్పర గౌరవభావాన్ని కలిగించడం వల్ల పిల్లలు బాధ్యతాయుతమైన పౌరుల్లా, ఇతరుల పట్ల కూడా లైంగిక సహానుభూతి కలిగినవారిలా మసలుకుంటారని ఆమె చెప్పారు. ఇందులో టీచ ర్ల పాత్ర కూడా ఎంతగానో ఉంటుందని చెబుతూ, వారిని కూడా మొదటి పి కేటగిరీలో చేర్చారు. ఇక రెండవ పి - ‘పొలిటీషియన్స్’. స్త్రీల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో రాజకీయ నాయకులు ముఖ్యపాత్రను పోషించాలని బేడీ చెబుతున్నారు. ‘నిర్భయ’ వంటి ఒక శక్తిమంతమైన చట్టం రాజకీయ నాయకుల చొరవ కారణంగానే సాధ్యమయిందని ప్రశంసిస్తూ, సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వ్యాఖ్యానించవలసి వచ్చినప్పుడు పురుష రాజకీయ ప్రతినిధులు బాధితుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలని ఆమె కోరారు. మూడవ పి - ‘పోలీస్’. మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి పోలీసులు తమ దర్యాప్తులో, విచారణలో మానవీయ విలువలను పాటించాలని, అప్పుడే బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ ఆవేదనను చెప్పుకోగలరని బేడీ అన్నారు. అసలు పోలీసు అంటేనే తమకొక ధీమా, ధైర్యం, భరోసా అన్న భావనను మహిళలో కలిగించేందుకు పోలీసులు తమ ప్రవర్తనను, విధానాలను మార్చుకోవాలని ఆమె సూచించారు. నాల్గవ పి - ‘ప్రాసిక్యుషన్’. న్యాయవ్యవస్థ పనితీరు బాధిత స్త్రీలకు నమ్మకాన్నీ, ఊరటనూ కలిగించేలా ఉండాలని బేడీ అభిలషించారు. నిర్భయ కేసులో ఈ దేశ న్యాయవ్యవస్థ స్త్రీలకు ఎంతో ైధె ర్యాన్ని ఇవ్వగలిగిందని శ్లాఘించారు. ఐదవ పి గా ‘ప్రిజన్’ని తీసుకొచ్చారు బేడీ. జైళ్ల సంస్కరణల్లో భాగంగా అధికారులు మహిళా అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనీ, మహిళల కోణంలోంచి ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవాలనీ అన్నారు. చివరిగా ‘ప్రెస్’ను ఆరవ పి కేటగిరీలోకి చేర్చారు కిరణ్ బేడీ. పాత్రికేయులు, పత్రికలు మహిళా సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించాలని కోరారు. సమాజంలో ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణన పొందుతున్న మహిళలు... పురుషులకు సమానంగా ఎదిగేందుకు అవసరమైన విజ్ఞానాన్నీ, మార్గదర్శకత్వాన్నీ పత్రికలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలా ఆరువైపుల నుంచి గట్టి ప్రయత్నాలు జరిగితే స్త్రీల భద్రత, స్త్రీల రక్షణ అసాధ్యమేమీ కాదని కిరణ్ బేడీ అన్నారు.