ముంబై: ముప్పై ఏళ్ల క్రితం ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) వ్యవస్థాపక సభ్యుడిగా, ముంబైలో కరుడుగట్టిన నేరస్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ (81) కోవిడ్ బారిన పడి అనంతరం తలెత్తిన అనారోగ్య కారణాలతో శుక్రవారం కన్నుమూశారు. ఈయనకు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవలే కోవిడ్ బారిన పడిన ఖాన్ అంధేరీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొద్దిరోజులకే అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో శుక్రవారం ఆస్పత్రికి తీసుకెళ్లగా అడ్మిట్ కావడానికి ముందే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
చదవండి: (Maharashtra Survey: పిల్లల్ని బడికి పంపించేది లేదు!)
గ్యాంగ్ స్టర్లకు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఎన్నో ఆపరేషన్లలో నిర్వహించారు. ఈయన 1963 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. 1995లో మహరాష్ట్ర ఐజీగా సేవలందించిన ఆయన అదే ఏడాది పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1990లో దేశంలో ఉగ్రవాదులకు, గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా తొలిసారిగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఇందుకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నేరస్తుల ఆటకట్టించేందుకు ప్రత్యేకంగా ఏర్పడిన స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) స్ఫూర్తితో దేశంలో ఏటీఎస్‌ను ఏర్పాటు చేశారు. ‘‘ఖాన్ తన దళాన్ని ఎప్పుడూ ముందుండి నడిపించేవారు. చాలా ధైర్యశాలి’’అని ఆయనతో పాటు పనిచేసిన రిటైర్డ్ ఏసీపీ ఇక్బాల్ షేక్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
చదవండి: (పంజాబ్ ఎన్నికల్లో అందరిదీ సేఫ్ గేమే!..)
‘‘1991 జనవరి 21న గుజరాత్‌లోని వడోదరాలో జరిగిన ‘‘ఆపరేషన్ బరోడా’’కు ఆయన నేతృత్వం వహించి అప్పటి ఖలిస్తాన్ కమాండ్ లీడర్ బాల్ డియో సింగ్ సైనీ తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. 1992లో ములుంద్ ఉపనగరంలోని ఖిందీపాదాలో ఐదుగురు ఉగ్రవాదులను కాల్చిచంపారు. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానం పేల్చివేత ఘటనకు బాధ్యుడు, నాటి హరియాణ ముఖ్యమంత్రి భజన లాల్‌పై కాల్పులకు తెగబడిన ఉగ్రవాది మన్‌జిత్ సింగ్ అలియాస్ లాసింగ్ 1992లో ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ నుంచి వస్తుండగా ఖాన్ బృందం అరెస్టు చేసింది. ఇంకా ముంబైలో కరుడుగట్టిన నేరస్తులు మాయా డోలాస్, దిలీప్ బువాలను లోఖండ్ వాలా కాంప్లెక్స్‌లోని స్వాతి భవనంలో ఖాన్ కాల్చి చంపారు’’అని ఇక్బాల్ షేక్ గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment