మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్
లక్నో: 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నానంటూ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ అరెస్టయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై ఆయన్ను ఆరెస్టు చేసినట్లు పోలీసుల ప్రకటించారు. ఈ నెల 16న ఓ యువతి (24) ఆమె స్నేహితుడు కలసి సుప్రీంకోర్టు ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు.
తనపై బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అతుల్‌రాయ్ అత్యాచారం చేయగా, ఆయనకు సాయం చేసేలా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె ఆరోపించారు. అనంతరం కాలిన గాయాలతో ఆ యువతి ఈ నెల 24న కన్నుమూశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందం (సిట్)ఏర్పాటైంది. ఈ బృందం విచారణ జరిపి అనంతరం ఆ రిపోర్టును శుక్రవారం సమర్పించింది.
ఈ నేపథ్యంలోనే ఠాకూర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి వ్యతిరేకంగా, నిందితుడు అతుల్‌రాయ్‌కు మద్దతుగా ఆయన వ్యవహరించారని అభియోగాలు మోపి, మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు ఇలా పని చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment