Amitabh Thakur
-
మాజీ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్ అరెస్ట్
లక్నో: 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నానంటూ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ అరెస్టయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై ఆయన్ను ఆరెస్టు చేసినట్లు పోలీసుల ప్రకటించారు. ఈ నెల 16న ఓ యువతి (24) ఆమె స్నేహితుడు కలసి సుప్రీంకోర్టు ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. తనపై బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అతుల్‌రాయ్ అత్యాచారం చేయగా, ఆయనకు సాయం చేసేలా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె ఆరోపించారు. అనంతరం కాలిన గాయాలతో ఆ యువతి ఈ నెల 24న కన్నుమూశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందం (సిట్)ఏర్పాటైంది. ఈ బృందం విచారణ జరిపి అనంతరం ఆ రిపోర్టును శుక్రవారం సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ఠాకూర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి వ్యతిరేకంగా, నిందితుడు అతుల్‌రాయ్‌కు మద్దతుగా ఆయన వ్యవహరించారని అభియోగాలు మోపి, మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు ఇలా పని చేస్తున్నారని విమర్శించారు. -
యూపీ సీఎం యోగిపై మాజీ ఐపీఎస్ పోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తారని ఆయన కుటుంబం శనివారం వెల్లడించింది. యోగి ఎక్కడపోటీ చేస్తే అక్కడి నుంచే అమితాబ్ కూడా పోటీ చేస్తారని ఆయన భార్య నూతన్ తెలిపారు. యోగి అప్రజాస్వామిక, వివక్షాపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిం చారు. అమితాబ్‌కు ఈ పోటీ విలువలతో కూడినదని చెప్పారు. యోగి తప్పులను అమితాబ్ ఎత్తిచూపుతారని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనం కోసమంటూ మార్చి 23న కేంద్ర హోంశాఖ అమితాబ్‌ను బలవంతంగా రిటైర్ చేయించిన సంగతి తెలిసిందే. తనను బెదిరించారంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌పై ఆరోపణలు చేయడంతో అమితాబ్‌పై దుమారం రేగింది. అనంతరం ఆయన్ను హోంశాఖ 2015లో సస్పెండ్ చేసింది. -
ఐపీఎస్‌పై ‘నిఘా’ దాడులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంతో ఘర్షణకు దిగిన ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ఇంటిపై అక్రమాస్తుల కేసులో విజిలెన్స్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంటి బయట విజిలెన్స్ సిబ్బంది ఠాకూర్‌తో గొడవపడి, ఆయన చేతిలోని పత్రాలు లాక్కున్నారు. వాటినివ్వాలని ఠాకూర్ చెప్పినా తిరస్కరించారు. ‘ములాయంపై ఎఫ్ఐఆర్ దాఖలుచేయడంతో నన్ను వేధిస్తున్నారు. విజిలెన్స్ డెరైక్టర్ భానుప్రతాప్ సమాజ్‌వాదీ కార్యకర్తలా వ్యవహరిస్తుండటంతో విజిలెన్స్ బృందం నా ఇంటిపై దాడి చేసింది’ అని ఠాకూర్ ఆరోపించారు. తాను చెప్పినట్లు వినాలంటూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ములాయంపై ఠాకూర్ కేసు పెట్టడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. -
ములాయంపై కేసు నమోదు చేయండి
లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై కేసు నమోదు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. ఐజీ ర్యాంకు అధికారి అమిత్ థాకూర్ ను బెదిరించారన్న ఆరోపణలపై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. పెను వివాదానికి దారి తీసిన ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. అమిత్ థాకూర్ పిటిషన్ ను సెక్షన్156(3) కింద విచారణకు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సోమప్రభ స్వీకరించారు. ములాయంపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టాలని హజ్రత్ జంగ్ ఎస్ హెచ్ఓను ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సూచించింది. ములాయంపై కేసు నమోదు చేసేందుకు యూపీ పోలీసులు నిరాకరించడంతో అమిత్ థాకూర్ కోర్టును ఆశ్రయించారు. తనను ములాయం ఫోన్లో బెదిరించారని ఆయన ఆరోపించారు. -
ఆ పోలీసుల మూడో నిర్లక్ష్యం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ నేతలకే కాదు.. ప్రభుత్వాధికారులకు కూడా కాసింత లెక్కలేనితనం ఒంటబట్టింది. ఈ విషయం తెలిస్తే ఆ మాట నిజమే అనుకోక తప్పదు. సమాజ్ వాది పార్టీ అధినేత తనను బెదిరించాడని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని సస్పెండ్‌కు గురైన ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కోర్టును ఆశ్రయించడంతో ఆ మేరకు విచారణ చేపట్టి రిపోర్టు తనకు సమర్పించాలని అక్కడి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పోలీసు అధికారిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాలను పోలీసులు ఇప్పటికే రెండుసార్లు బేఖాతరు చేయగా మరోసారి కూడా అలాంటి తప్పిదానికి పాల్పడ్డారు. కోర్టు ఇచ్చిన మూడో అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా రిపోర్టు విషయం పట్టించుకోలేదు. దీంతో ఠాకూర్ భార్య ఆర్టీఐ ఉద్యమకారురాలు నూతన్ ఠాకుర్ కోర్టుకు ఈ విషయం గుర్తు చేశారు. దీంతో హజ్రతాంజ్ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం లోగా నివేదిక ఇవ్వాలని ఇక అదే పోలీసులకు చివరి అవకాశం అని హెచ్చరించింది. అప్పటిలోగా నివేదిక ఇవ్వకుంటే శుక్రవారం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. -
కోర్టు తలుపు తట్టిన అమితాబ్
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై పోరాడుతున్న సస్పెండెడ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ కోర్టు తలుపు తట్టారు. తనను బెదిరించిన ములాయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమితాబ్ ఫిర్యాదును స్వీకరించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సోమప్రభ మిశ్రా.. నివేదిక సమర్పించాలని హజ్రత్ గంజ్ పోలీసులను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. థాకూర్ భార్య నూతన్ థాకూర్ తన న్యాయవాదితో ఈ ఫిర్యాదు చేశారు. జూలై 11న హజ్రత్ గంజ్ లో, జూలై 23న లక్నోలో థాకూర్ ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఓ సామాజికాంశంలో ములాయం తనను బెదిరించారంటూ మీడియాకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు. అంతేకాకుండా ములాయంపై కేసు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ సర్కారు ఆయనపై కక్ష గట్టింది. ఆయనపై రేప్ ఆరోపణలతో ఓ కేసును పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత మూడు రోజులకే సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించావంటూ సస్పెండ్ చేశారు. తర్వాత థాకూర్, ఆయన బంధువుల ఆస్తుల వివరాలు వెలికి తీసేందుకు ఆదేశాలు జారీ చేసింది. -
'అత్యాచార కేసుతో ఆ పార్టీకి సంబంధం లేదు'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఐజీ అమితాబ్ థాకూర్‌పై అత్యాచార కేసు నమోదు చేయడం వెనుక అధికార సమాజ్‌వాదీ పార్టీ ప్రమేయం లేదని బాధితురాలి భర్త చెప్పారు. ఐజీపై కేసు పెట్టాలని తమపై రాజకీయ నాయకులెవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. ఐజీ తనపై అత్యాచారం చేశారని, ఇందుకు ఆయన భార్య కూడా సహకరిస్తుందని ఆరోపిస్తూ ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ తనను ఫోన్లో బెదిరించారని అమితాబ్ థాకూర్ ఫిర్యాదు చేసిన అనంతరం ఆయనపై రేస్ కేసు నమోదైంది. దీంతో ప్రతీకార చర్యగానే ఈ కేసు పెట్టారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి భర్త స్పందిస్తూ.. ఏ రాజకీయ నాయకుడితోనూ తనకు సంబంధాలులేవని చెప్పాడు. -
'ఆయన తిట్టడంలో తప్పేమీ లేదు'
లక్నో: ఐపీఎస్ అధికారిపై నోరుపారేసుకున్న తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ వెనకేసుకొచ్చారు. తన తండ్రి చేసినదాంట్లో తప్పేంలేదని అన్నారు. 'ముఖ్యమంత్రిని అయిన నన్నే ములాయం సింగ్ యాదవ్ తిడుతుంటారు. అలాంటి ఆయన అధికారిని తిట్టడంలో తప్పేంలేద'ని అఖిలేశ్ వెనకేసుకొచ్చారు. 75 ఏళ్ల ములాయం పలుమార్లు బహిరంగంగానే తన కుమారుడిని విమర్శించారు. తాజాగా ఆయన ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ పై నోరుపారేసుకున్నారు. అయితే తనను తిట్టే అధికారం ములాయంకు లేదని, ఆయనేమీ ముఖ్యమంత్రి కాదని థాకూర్ అన్నారు. అధికారిపై తిట్లదండం అందుకున్న ములాయంకు సమాజ్ వాదీ పార్టీ బాసటగా నిలిచింది. -
ఐజీపై అత్యాచారం కేసు
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐజీ అమితాబ్ థాకూర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసులు థాకూర్‌తో పాటు ఆయన భార్య నూతన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి గతేడాది తనపై థాకూర్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ఇందుకు థాకూర్ భార్య నూతన్ ఆయనకు సహకరించారంటూ ఆరోపించింది. ఇదిలావుండగా, ములాయం తనను ఫోన్లో బెదిరించారంటూ శనివారం థాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా థాకూర్ ఆరోపణలను సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి సీపీ రాయ్ తోసిపుచ్చారు. -
మాజీ సీఎం బెదిరిస్తున్నారంటూ ఐజీ ఫిర్యాదు
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ బెదిరిస్తున్నారంటూ ఆ రాష్ట్రానికి సీనియర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ములాయం తనను ఫోన్లో బెదిరిస్తున్నారంటూ అమితాబ్ ఆరోపించారు. తాను చెప్పినట్టు నడుచుకోవాలని, లేకుంటే 2006లో మాదిరిగా దాడి పునరావృతం అవుతుందని ములాయం హెచ్చరించినట్టు అమితాబ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2006లో ఎస్పీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అమితాబ్‌పై దాడి చేశారు. ఓ ల్యాండ్ ఫోన్ నుంచి ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి ములాయం మాట్లాడనున్నట్టు చెప్పారని, ఆ తర్వాత ములాయం తనతో 2 నిమిషాలకు పైగా మాట్లాడినట్టు అమితాబ్ చెప్పారు. ఇదిలావుండగా, అమితాబ్, ఆయన భార్య సామాజిక ఉద్యమకర్త నూతన్ థాకూర్.. ఉత్తరప్రదేశ్ గనుల శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, తదితరులపై గురువారం ఫిర్యాదు చేశారు. తమను తప్పుడు కేసుల్లో ఇరికేందకు ప్రయత్నిస్తున్నారని ఐజీ దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు.