కోర్టు తలుపు తట్టిన అమితాబ్
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై పోరాడుతున్న సస్పెండెడ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ థాకూర్ కోర్టు తలుపు తట్టారు. తనను బెదిరించిన ములాయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమితాబ్ ఫిర్యాదును స్వీకరించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సోమప్రభ మిశ్రా.. నివేదిక సమర్పించాలని హజ్రత్ గంజ్ పోలీసులను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.
థాకూర్ భార్య నూతన్ థాకూర్ తన న్యాయవాదితో ఈ ఫిర్యాదు చేశారు. జూలై 11న హజ్రత్ గంజ్ లో, జూలై 23న లక్నోలో థాకూర్ ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఓ సామాజికాంశంలో ములాయం తనను బెదిరించారంటూ మీడియాకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు. అంతేకాకుండా ములాయంపై కేసు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ సర్కారు ఆయనపై కక్ష గట్టింది. ఆయనపై రేప్ ఆరోపణలతో ఓ కేసును పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత మూడు రోజులకే సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించావంటూ సస్పెండ్ చేశారు. తర్వాత థాకూర్, ఆయన బంధువుల ఆస్తుల వివరాలు వెలికి తీసేందుకు ఆదేశాలు జారీ చేసింది.