ఆ పోలీసుల మూడో నిర్లక్ష్యం
లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ నేతలకే కాదు.. ప్రభుత్వాధికారులకు కూడా కాసింత లెక్కలేనితనం ఒంటబట్టింది. ఈ విషయం తెలిస్తే ఆ మాట నిజమే అనుకోక తప్పదు. సమాజ్ వాది పార్టీ అధినేత తనను బెదిరించాడని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని సస్పెండ్కు గురైన ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కోర్టును ఆశ్రయించడంతో ఆ మేరకు విచారణ చేపట్టి రిపోర్టు తనకు సమర్పించాలని అక్కడి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పోలీసు అధికారిని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఆ ఆదేశాలను పోలీసులు ఇప్పటికే రెండుసార్లు బేఖాతరు చేయగా మరోసారి కూడా అలాంటి తప్పిదానికి పాల్పడ్డారు. కోర్టు ఇచ్చిన మూడో అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా రిపోర్టు విషయం పట్టించుకోలేదు. దీంతో ఠాకూర్ భార్య ఆర్టీఐ ఉద్యమకారురాలు నూతన్ ఠాకుర్ కోర్టుకు ఈ విషయం గుర్తు చేశారు. దీంతో హజ్రతాంజ్ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం లోగా నివేదిక ఇవ్వాలని ఇక అదే పోలీసులకు చివరి అవకాశం అని హెచ్చరించింది. అప్పటిలోగా నివేదిక ఇవ్వకుంటే శుక్రవారం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది.