ఆరువైపుల నుంచి అండాదండ
బేడీ పి - 6
మహిళల భద్రత, రక్షణల కోసం ప్రభుత్వాలు ఎంత కిందామీదా అవుతున్నా కూడా ఆశించిన ఫలితాలను పూర్తిగా సాధించలేకపోతున్నాయన్నది నిజం. మహిళలను కంటికి రెప్పలా కాపుగాయడానికి ఎప్పటికప్పుడు ఎన్ని చట్టాలు పుట్టుకొస్తున్నా, వాటిని ఉల్లంఘించేవారి సంఖ్య కూడా అందుకు సమానంగా పెరిగిపోతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను, అఘాయిత్యాలను నివారించడం, నిరోధించడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానంగా మాజీ ఐ.పి.ఎస్. అధికారి, సామాజిక కార్యకర్త కిరణ్ బేడి ‘సాధ్యమే’ అని అంటున్నారు. ఊరికే అనడం కాదు, అందుకు ఓ ఆరు సూత్రాలను కూడా సూచించారు. వాటికి ఆమె ‘6 పి కాన్సెస్ట్’ అని పేరుపెట్టారు. ఈ ఆరుసూత్రాలను కనుక పాటించగలిగితే మహిళలకు అన్ని వైపుల నుంచి భద్రతను, రక్షణను కల్పించడం సాధ్యమౌతుందని ఐక్యరాజ్యసమితి 70వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె చెప్పారు.
‘6 పి కాన్సెప్టు’లో మొదటి పి - ‘పేరెంట్స్. పిల్లల పెంపకంలో (ముఖ్యంగా అబ్బాయిల పెంపకంలో) కనుక తల్లిదండ్రులు జాగ్రత్త వహించినట్లయితే భవిష్యత్తులో స్త్రీలపై జరిగే హింసను నివారించగలమని బేడీ అభిప్రాయపడ్డారు. ఆడ, మగ అన్న వ్యత్యాసం లేకుండా ఇద్దరికీ సమాన అవకాశాలను కల్పించడం, ఒకరిపై ఒకరికి పరస్పర గౌరవభావాన్ని కలిగించడం వల్ల పిల్లలు బాధ్యతాయుతమైన పౌరుల్లా, ఇతరుల పట్ల కూడా లైంగిక సహానుభూతి కలిగినవారిలా మసలుకుంటారని ఆమె చెప్పారు. ఇందులో టీచ ర్ల పాత్ర కూడా ఎంతగానో ఉంటుందని చెబుతూ, వారిని కూడా మొదటి పి కేటగిరీలో చేర్చారు.
ఇక రెండవ పి - ‘పొలిటీషియన్స్’. స్త్రీల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో రాజకీయ నాయకులు ముఖ్యపాత్రను పోషించాలని బేడీ చెబుతున్నారు. ‘నిర్భయ’ వంటి ఒక శక్తిమంతమైన చట్టం రాజకీయ నాయకుల చొరవ కారణంగానే సాధ్యమయిందని ప్రశంసిస్తూ, సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వ్యాఖ్యానించవలసి వచ్చినప్పుడు పురుష రాజకీయ ప్రతినిధులు బాధితుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలని ఆమె కోరారు.
మూడవ పి - ‘పోలీస్’. మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి పోలీసులు తమ దర్యాప్తులో, విచారణలో మానవీయ విలువలను పాటించాలని, అప్పుడే బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ ఆవేదనను చెప్పుకోగలరని బేడీ అన్నారు. అసలు పోలీసు అంటేనే తమకొక ధీమా, ధైర్యం, భరోసా అన్న భావనను మహిళలో కలిగించేందుకు పోలీసులు తమ ప్రవర్తనను, విధానాలను మార్చుకోవాలని ఆమె సూచించారు.
నాల్గవ పి - ‘ప్రాసిక్యుషన్’. న్యాయవ్యవస్థ పనితీరు బాధిత స్త్రీలకు నమ్మకాన్నీ, ఊరటనూ కలిగించేలా ఉండాలని బేడీ అభిలషించారు. నిర్భయ కేసులో ఈ దేశ న్యాయవ్యవస్థ స్త్రీలకు ఎంతో ైధె ర్యాన్ని ఇవ్వగలిగిందని శ్లాఘించారు.
ఐదవ పి గా ‘ప్రిజన్’ని తీసుకొచ్చారు బేడీ. జైళ్ల సంస్కరణల్లో భాగంగా అధికారులు మహిళా అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనీ, మహిళల కోణంలోంచి ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవాలనీ అన్నారు. చివరిగా ‘ప్రెస్’ను ఆరవ పి కేటగిరీలోకి చేర్చారు కిరణ్ బేడీ. పాత్రికేయులు, పత్రికలు మహిళా సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించాలని కోరారు. సమాజంలో ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణన పొందుతున్న మహిళలు... పురుషులకు సమానంగా ఎదిగేందుకు అవసరమైన విజ్ఞానాన్నీ, మార్గదర్శకత్వాన్నీ పత్రికలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలా ఆరువైపుల నుంచి గట్టి ప్రయత్నాలు జరిగితే స్త్రీల భద్రత, స్త్రీల రక్షణ అసాధ్యమేమీ కాదని కిరణ్ బేడీ అన్నారు.