సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలకు తాము సిద్ధమని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ఆ పార్టీ సుముఖంగా లేదన్న సంకేతాలను ఇచ్చాయి. దీనిని బట్టి సర్కారు ఏర్పాటుకు లెప్టినెంట్ గవర్నర్ ఆహ్వానాన్ని అందించినా భారతీయ జనతా పార్టీ దానిని తోసిపుచ్చవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని అనుమతించవలసిందిగా కోరుతూ లెప్టినెంట్ గవర్నర్ రాసిన లేఖకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ మంగళవారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి తెలపడంతో వేడెక్కిన ఢిల్లీ రాజకీయాలు బీజేపీ నేతలు చేసి ప్రకటనలతో కొంత చల్లబడ్డాయి.
ఢిల్లీలో ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ పూర్తి మెజారిటీతో గెలుస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విలేకరులతో చెప్పారు. బీజేపీ ఎన్నికలకు వెనుకాడుతోందని ఆప్, కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని, ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలనుకుంటోందని ఆయన చెప్పారు. ఇతర పార్టీలను చీల్చి సర్కారు ఏర్పాటుచేసే ప్రశ్నే లేదన్నారు. పూర్తి మెజారిటీతో గెలిచే అవకాశాలున్నప్పుడు బీజేపీ ఎన్నికలంటే ఎందుకు భయపడుతుందని ఆయన ఎదురుప్రశ్న వేశారు.
బీజేపీ సరైన సమసయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. వెంకయ్యనాయుడు తమ సీనియర్ నేత అని, ఆయన పార్టీ వైఖరిని తెలిపారని ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఢిల్లీ వ్యవహారంపై పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఢిల్లీ నాయకులు ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చిస్తారని, ఆ తరువాత అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
అసెంబ్లీలో తగిన మెజారిటీ లేని బీజేపీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయగలదన్న అనుమానం ప్రత్యర్థి పార్టీలు, రాజకీయపండితులు, సామాన్యులతో పాటు సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా వచ్చింది. అతి పెద్ద రాజకీయ పార్టీ (బీజేపీ)ని ఎల్జీ ఆహ్వానించినా ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి కావలసిన సంఖ్యా బలం ఆ పార్టీకి ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. బీజేపీకి సిగ్గూ శరం ఏవైనా మిగిలిఉంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధపడాలని ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ సవాలు చేశారు. బీజేపీకి బలం ఉంటే ఐదు నెలల కిందటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటుచేసే అన్ని ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ తెలిపింది. అటువంటి ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆ పార్టీ అభిప్రాయపడింది. దేశమంతటా తమ ప్రభంజనం ఉందని చెప్పుకునే బీజేపీ ఎన్నికలంటే భయపడుతోందని ఢిల్లీ కాంగ్రె స్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ అన్నారు. సర్కారు ఏర్పాటు చేయడానికి సంఖ్యా బలంలేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ డిసెంబర్‌లో చెప్పారని కాంగ్రెస్ నేత ముఖేష్ శర్మ గుర్తు చేశారు. అప్పుడు లేని సంఖ్యాబలం ఇప్పుడు ఎక్కడనుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ప్రయత్నిస్తోన్న బీజేపీ, కావాలనే తాత్సారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యాబలం బీజేపీకి లేదు. 70 స్థానాలున్న అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 29, ఆమ్ ఆద్మీ పార్టీకి 27, కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కాక ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఒక జేడీయూ ఎమ్మెల్యే ఉన్నారు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 32 సీట్లు గెలిచినప్పటికీ ముగ్గురు శాససభ్యులు లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన తరువాత శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాలకు నవంబర్ 25న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ కూడా మంగళవారం వెలువడింది. అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్‌ఆద్మీ పార్టీ 28 సీట్లు గెలిచింది. కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వినోద్ కుమార్ బిన్నీని ఆప్ బహిష్కరించింది. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే బీజేపీకి 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పార్టీ శాసనసభ్యులు 29 మందితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాంబీర్‌షౌకీన్, వినోద్‌కుమార్ బిన్నీ మద్దతు ప్రకటించిన తరువాత కూడా బీజేపీకి సంఖ్యాబలం తక్కువే అవుతుంది. అటువంటి పరిస్థితిలో మెజారిటీ కోసం బీజేపీ ప్రత్యర్థి పార్టీలను చీల్చక తప్పదు. దేశమంతటారాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉన్న ఈ పరిస్థితిలో ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటుచేశామన్న అప్రతిష్ట మూటగట్టుకోవడానికి బీజేపీ వెనుకాడుతోంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న ఆ పార్టీ ఢిల్లీలోనూ ఎన్నికలవైపే మొగ్గు చూపుతోంది.
మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: డీపీసీసీ
ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మంగళవారం డిమాండ్ చేసింది. రాజధాని నగరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్రాన్ని, లెప్టినెంట్ గవర్నర్‌ను సుప్రీం కోర్టు మందలించిన నేపథ్యంలో డీపీసీసీలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్, డీపీసీసీ అధ్యక్షులు అర్విందర్ సింగ్ లవ్లీ హాజరయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ ప్రతినిధి ముఖేశ్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీని రద్దు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా ఓ తీర్మానం ఆమోదించామని చెప్పారు. ఎన్నికల కోసం సిద్ధం కావాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని చెప్పారు.
ఎన్నికలవైపే మొగ్గు?
Published Tue, Oct 28 2014 10:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement