న్యూఢిల్లి: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్.. జైలు నుంచే అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిన విషయం తెలిసిందే. జైలులో అన్ని సౌకర్యాలు అందించేందుకు సుమారు 80 మందికిపైగా అధికారులకు లక్షల్లో ముడుపులు అందించాడు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. తాను జైలులో సురక్షితంగా ఉండేందుకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ముడుపులు ముట్టజెప్పానని వెల్లడించటం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుకేశ్ లేఖ రాసినట్లు తెలిసింది. తనను జైలులో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తనకు రక్షణ కల్పించేందుకు జైలులోనే ఉన్న సత్యేంద్ర జైన్‌కు ప్రొటెక్షన్ మనీ ఇచ్చానని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు సుకేష్ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో రాజ్యసభ నామినేషన్ కోసం రూ.50 కోట్లు తీసుకుందని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒక మోసాల పార్టీ అంటూ ఆరోపించింది.
ఖండించిన కేజ్రీవాల్..
ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు సుకేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అవన్ని తప్పుడు ఆరోపణలని, గుజరాత్ ఎన్నికలు, మోర్బీ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన కుట్రగా ఆరోపించారు. ‘అన్ని కట్టుకథలు. మోర్బీ ఘటనపై దృష్టి మళ్లించే ప్రయత్నాలు. గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో వారు భయపడుతున్నారు. ఆప్ వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్థిక నేరస్థుడిని ఉపయోగించి సత్యేంద్ర జైన్‌పై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు.’ అని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఇదీ చదవండి: Rs 200 crore extortion case: బాలీవుడ్ హీరోయిన్, భర్తకు ఈడీ షాక్
Comments
Please login to add a commentAdd a comment