సాక్షి, న్యూఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గద్దెదిగిన తరువాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించి ఆర్నెల్ల కాలం గడిచిపోయింది. ఇన్నిరోజులుగా విధానసభ సుప్తచేతనావస్థలో కొన సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ యత్నిస్తున్నప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రపతి పాలన కొనసాగుతుందా? లేక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారా? ఎన్నికలు జరుపుతారా ?అనే అంశంపై ఊహాగానాలు ఇంకాకొనసాగుతూనే ఉన్నాయి. 49 రోజుల పాలన తరువాత అర్వింద్ కేజ్రీవాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు మేరకు అదే నెల 17న రాష్ట్రపతి పాలన విధించారు. 1993లో ఢిల్లీలో విధానసభ ఏర్పాటైంది. ఆ తర్వాత రాష్ట్రపతిపాలన విధించడం ఇదే ప్రధమం. విధానసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతిపాలన విధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎటువంటి ఇబ్బందులూ లేవు.విధాన సభను తక్షణమే రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ రాజకీయ భవితవ్యంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుచేయడానికి ఇంతవరకు ఇటు కేంద్రంగానీ, లెఫ్టినెంట్ గవర్నర్ గానీ ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టారనే విషయాన్ని కేంద్రం త్వరలో సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది.
ఈ వ్యవహారంపై సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా ఆర్నెల్లుగా రాష్ర్టపతి పాలన కొనసాగుతుండడంతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కొత్త అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టలేదని, గతంలో చేపట్టినవి కొనసాగడం లేదని అంటున్నారు. బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన పథకాల అమలుకు, ధరల నియంత్రణకు లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఢిల్లీ సర్కారు కృషి చేస్తున్నప్పటికీ గతంతో పోలిస్తే పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఆర్నెల్ల కాలంలో లెఫ్టినెంట్ గవర్నర్ దాదాపు రూ. 2,000 కోట్ల వ్యయంతో కూడిన 25 ప్రాజెక్టులను ప్రకటించారు. అయితే వాటి ఒక్కటి కూడా ఇంతవరకు పూర్తికాలేదని అంటున్నారు.
కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు.అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు.
ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రాష్ట్రపతి పాలనకు ఆర్నెల్లు ఎన్నికలపై ఇంకా ఊహాగానాలే
Published Wed, Aug 20 2014 10:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement