కొత్త సీఎం వచ్చినా దూకుడు తగ్గించని గవర్నర్ | internal clashes between cm narayana swamy and kiran bedi | Sakshi
Sakshi News home page

కొత్త సీఎం వచ్చినా దూకుడు తగ్గించని గవర్నర్

Published Tue, Aug 23 2016 3:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

internal clashes between cm narayana swamy and kiran bedi

చెన్నై: పారిశుధ్యంపై పోరు కోసం రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ పుదుచ్చేరిలో ఆమెకు ఎదురవుతున్న కష్టాలు ఏమిటో అన్న అంశంపై దృష్టి పెట్టే వాళ్లు అధికమయ్యారు. అక్కడి కాంగ్రెస్ పాలకులు, గవర్నర్ కిరణ్‌బేడీ మధ్య సాగుతున్న అంతర్యుద్ధంలో ఉద్యోగులు నలిగి పోతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
 
పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించగానే, కొత్త  ప్రభుత్వానికి పక్కలో బల్లెం అన్నట్టుగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడీని కేంద్రం నియమించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే పగ్గాలు చేపట్టిన కిరణ్‌బేడీ తన దూకుడును పెంచారు. సంస్కరణలు, కొత్త విధానాలు అంటూ పుదుచ్చేరి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అక్కడి ప్రజల మనసు చూరగొనే రీతిలో దూసుకెళ్లారు.

అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌తో సరితూగే విధంగా సీఎం అభ్యర్థిగా నారాయణస్వామిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా, రాజకీయ అనుభవం, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడగలిగే నారాయణ స్వామి  నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తన దూకుడును కిరణ్ బేడీ తగ్గించ లేదు.
 
 ఈ సమయంలో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య విభేదాలు సాగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని సీఎం, గవర్నర్ ఇద్దరూ ఖండించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పుదుచ్చేరి ప్రగతి కోసం తామిద్దరం శ్రమిస్తున్నామని వారు స్పష్టం చేశారు.  కాగా కొత్త ప్రభుత్వ పాలకులు తమ రాజకీయాన్ని ప్రదర్శించే పనిలో పడ్డట్టుంది. కిరణ్ బేడీ సంస్కరణలకు చెక్ పెట్టే రీతిలో సీఎం చాప కింద నీరులా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
 
 అందుకే పారిశుధ్య కార్మికుల ద్వారానే కిరణ్‌బేడీకి వ్యతిరేకంగా నిరసనలు సాగించేందుకు తగ్గట్టుగా వ్యూహ రచన చేసినట్టు తెలిసింది. ఆదివారం తమకు సెలవు కావాలంటూ కార్మికులు గళం విప్పారు. దీంతో గవర్నర్ ఆదేశాలు రాజ్‌భవన్ వరకే పరిమితం చేయాలని, తాము ఆదేశించే వాటినే అమలు చేయాలన్నట్టుగా ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు సైతం వెళ్లినట్లు సమాచారం.   
 
 ఈ సీఎం నారాయణ స్వామి, గవర్నర్ కిరణ్ బేడీ మధ్య ఉద్యోగులు, కార్మికులు నలిగి పోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. పాలకులు చెప్పింది వినాలో, గవర్నర్ ఆదేశాలను అనుసరించాలో  అన్న సందిగ్ధంలో వారు ఉన్నారు. పైకి తమ మధ్య విభేదాలు లేవన్నట్టుగా ఆ ఇద్దరూ చెప్పుకుంటున్నా, లోలోపల పాలనా పరంగా ఉన్న హక్కులపై అంతర్యుద్ధమే సాగుతున్నట్టు పుదుచ్చేరిలో చర్చ సాగుతుంది. ఈ చర్చ నేపథ్యంలో ఉద్యోగులతో జరిగిన సమాలోచనలో కిరణ్ తీవ్రంగా స్పందించారు.
 
 పై స్థాయి అధికారులు ఇతర ప్రాంతాలకు చెందిన వారైనా, కింది స్థాయిలో అమలు చేసే వాళ్లంతా స్థానికులు కావడం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల బేఖాతరు చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ సాగుతున్న వ్యవహారాలు, తాజా పరిస్థితుల నేపథ్యంలోనే అధికారులు, కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు చేయడంతోపాటుగా, ప్రజల మన్ననల్ని అందుకునే విధంగా రాజీనామా నినాదంతో కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించే పనిలో పడ్డట్టుగా పుదుచ్చేరిలో చర్చ హోరెత్తడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement