డాలర్ల కోసం పరుగులు తీయొద్దు
విద్యార్థులకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ హితవు
న్యూఢిల్లీ: కెరీర్‌ను కేవలం ధనసంపాదన కోణంలోనే చూడొద్దని, డాలర్లకోసం విదేశాలకు పరుగులు తీయొద్దని లెఫ్టినెంట్ గవర్నర్, ఛాన్సలర్ నజీబ్‌జంగ్ హితవు విద్యార్థులకు హితవు పలికారు. సమాజ సువిశాల ప్రయోజనాల కోసం ముందుకు సాగాలన్నారు. ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం (డీటీయూ)లో బుధవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఉన్నత విద్యకోసం వందలాదిమంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారని, దేశాన్ని గాలికొదిలేస్తున్నారంటూ విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి విద్యార్థులంతా వెనక్కి రావాలని ఆయన సూచిం చారు. ఇంకా అనేకమంది విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశమే రావడం లేదన్నారు. దేశ పురోభివృద్ధికి పాటుపడాలన్నారు.
సమయం కేటాయించండి
ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై వివిధ రూపాల్లో ఎంతో పెట్టుబడి పెట్టారని ఎల్జీ పేర్కొన్నా రు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని విద్యార్థులు కొంత సమయాన్ని దేశం కోసం కేటాయిస్తారని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా 72 మంది అండర్‌గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయే ట్ విద్యార్థులకు ఎల్జీ పట్టాలను అందజేశా రు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు పతకాలను అందజేశారు.
నైతిక విలువల్ని పెంపొందించుకోవాలి
అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నైతిక విలువలను పెంపొం దించుకోవాలని హితవు పలికారు. జీవి తంలో విజయపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. డిగ్రీ పట్టా ప్రతి ఒక్కరికీ అవసరమేనని, నైతిక విలువలు కూడా అంతకంటే ముఖ్యమని అన్నారు.
వార్షిక నివేదికను సమర్పించిన వీసీ
ఈ సందర్భంగా ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం (డీటీయూ) వైస్ ఛాన్సలర్ ప్రదీప్ కుమార్ డీటీయూ వార్షిక నివేదికను ఆహూతులకు చదివి వినిపించారు. 2013-14 విద్యా సంవత్సరంలో మొత్తం 13 నూతన ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. విద్యలో నాణ్యత పెంపుకోసం రూ. 12.5 కోట్ల మేర నిధులను వెచ్చించామన్నారు.