
ఢిల్లీ కొత్త ఎల్జీగా అనిల్ బైజల్
న్యూఢిల్లీ: దేశరాజధానికి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ బైజల్ (70) నియమితులయ్యారు. నజీబ్ జంగ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో అనిల్ బైజల్ (ఢిల్లీ 21వ ఎల్జీగా) బాధ్యతలు స్వీకరించనున్నారు. 1969 ఐఏఎస్ బ్యాచ్ అధికారైన అనిల్.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్‌గా, వివిధ కేంద్ర శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి సన్నిహితుడు. మన్మోహన్‌సింగ్ రూ.60వేల కోట్లతో ప్రారంభించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్ రూపకల్పనలోనూ బైజల్ క్రియాశీలకంగా వ్యవహరించారు.
అండమాన్ నికోబార్ ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్, ఎండీగా, సేల్స్–ఎక్సైజ్ టాక్స్ కమిషనర్‌గా, ఢిల్లీ, గోవాలకు డెవలప్‌మెంట్ కమిషనర్‌గా, నేపాల్‌లో భారత సహాయ మిషన్‌కు కౌన్సిలర్ ఇంచార్జ్‌గా పనిచేశారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఈ సంస్థ మాజీ సభ్యుడైన అజిత్ దోవల్ జాతీయ భద్రత సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ‘ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు స్వాగతం’అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు.