సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అనూహ్యమైన మద్దతు లభించింది. రాజ్యసభలో పలు పార్టీలు ఆయనకు అనుకూలంగా గళం విప్పాయి. గత కొంత కాలంగా ఢిల్లీ పాలనలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం ఎక్కువైపోవటం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఎల్జీ అలా చేస్తున్నాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ సహా మూడు పార్టీల నేతలు ఈ అంశంపై చర‍్చించారు. ఓ ముఖ్యమంత్రిని దారుణంగా అవమానిస్తున్నారంటూ వారు ప్రసంగించారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన్ని(కేజ్రీవాల్‌ను) ఓ చప్రాసీలా భావిస్తున్నాడు. ఓ ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో అవమానించటం తగదు’’ అని ఎస్పీ నేత నరేష్ అగర్వాల్ సభలో ప్రసంగించాడు. అదే సమయంలో దేశ రాజధాని హోదాలో ఉన్న ప్రాంత ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడం అవసరం ఉందన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఆపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐలు కూడా ఈ అంశంపై సభలో ప్రసంగించాయి.
కాగా, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అధికారంలోకి వచ్చాక లెఫ్టినెంట్ గవర్నర్లతో అస్సలు పోసగకపోవటం చూస్తూనే ఉన్నాం. గతంలో నజీబ్ జంగ్, తర్వాత అనిల్ బైజల్.. ఎల్జీ హోదాలో అధికారం చెలాయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మేరకు ఎల్జీ అధికారాలపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఓ పిటిషన కూడా దాఖలు చేయగా.. అది పెండింగ్‌లో ఉంది. తాజాగా సీఎం కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన ‘ఇంటింటికే ప్రజా సేవలు’ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపుల్ల వేయటంతో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment