న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. సాకేత్ కోర్టు ఆవరణలో ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. లాయర్ దుస్తుల్లో కాల్పులకు దిగిన వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు.
సౌత్ ఢిల్లీ సాకేత్ జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ఉదయం కాల్పుల ఘటన జరిగింది. కాల్పులకు ముందు.. జనంతో కిక్కిరిసిపోయిన కోర్టు కాంప్లెక్స్ వద్ద బాధితురాలితో సదరు నిందితుడికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో గన్ బయటకు తీసి ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు నిందితుడు. దీంతో ఆమె అక్కడి నుంచి పరుగు అందుకుంది.అక్కడే పోలీసులు, కొందరు లాయర్లు ఉన్నప్పటికీ.. ఎవరూ ఆమెను రక్షించేందుకు ముందుకు రాలేదు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో మహిళ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఇక కాల్పుల తర్వాత కోర్టు కాంప్లెక్స్ క్యాంటీన్ నుంచి పారిపోయాడు దుండగుడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కాల్పులకు తెగబడిన వ్యక్తి ఓ లాయర్. అయితే.. బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ అయ్యాడు. కిందటి ఏడాది జులైలో సదరు మహిళకు, ఓ అడ్వొకేట్‌కు వ్యతిరేకంగా సాకేత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడతను. తన నుంచి పాతిక లక్షల రూపాయలు తీసుకుని.. పెద్ద మొత్తంలో తిరిగి ఇస్తామంటూ ఆశ కల్పించారని, ఆపై మాట తప్పారని వాళ్లపై ఫిర్యాదు చేశాడా సస్పెండెడ్ లాయర్.
ఈ క్రమంలో.. ఈ ఉదయం లాయర్ దుస్తుల్లోనే కోర్టులోకి వచ్చి తన లాయర్‌తో మాట్లాడుతున్న మహిళపై కాల్పులకు తెగబడ్డాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో మహిళ సహా ఆమె లాయర్, మరో వ్యక్తికి బుల్లెట్ గాయాలు అయ్యాయని, కడుపులో బుల్లెట్ దూసుకుపోయిన మహిళను ఎయిమ్స్‌లో చేర్పించామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు.ఎల్జీ సాబ్.. మా ఢిల్లీలో ఏం జరుగుతోందంటూ మరో ట్వీట్ చేశారాయన.
ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించడం చేత కాకపోతే.. రాజీనామా చేయాలంటూ పరోక్షంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు చురకలు అంటించారు. ‘‘ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇతరుల పనులకు విఘాతం కలిగించే బదులు.. ప్రతీదానికి చెత్త రాజకీయాలు చేసే బదులు.. వాళ్లు వాళ్ల పనిని చూసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆయన(ఎల్జీని ఉద్దేశిస్తూ..) గనుక ఆ పని చేయకుంటే రాజీనామా చేస్తే వేరేవాళ్లు ఆ పని చూసుకుంటారు. రాముడిపై నమ్మకంతో ప్రజల భద్రతను వదిలిపెట్టలేం’’ అంటూ ట్వీట్ చేశారాయన.
LG साहिब, ये हमारी दिल्ली में क्या हो रहा है? pic.twitter.com/lpWy4NlOW7
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 21, 2023
👉 ఇదిలా ఉంటే.. దేశ రాజధానిలో కోర్టుల ఆవరణలోనే నేరాలు జరగడం కొత్తేమీ కాదు. కొన్నాళ్ల కిందట సౌత్‌వెస్ట్ ఢిల్లీ ద్వారక కోర్టులో లాయర్ వేషాల్లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపి పారిపోయారు.
👉 ఈ క్రమంలో.. తమకు రక్షణ కరువైందని, భద్రత కల్పించే దిశగా ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు కొందరు న్యాయవాదులు.
👉 కిందటి ఏడాది సెప్టెంబర్‌లో గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ అలియాస్ గోగిపై రోహిణి కోర్టు ప్రాంగణంలో.. న్యాయవాద దుస్తుల్లో వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ప్రతిగా.. ఆ ఇద్దరినీ పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపారు.
👉 అంతకు ముందు 2022 ఏప్రిల్‌లోనూ రోహిణి కోర్టు ఆవరణలో క్లయింట్ల విషయంలో ఇద్దరు అడ్వొకేట్ల మధ్య కాల్పులు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment